Niveditha :
గులాబీ నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గ బరిలో ఉంటానని దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏక గ్రీవం కావడానికి ఇతర పార్టీలు కూడా సహకరించాలని కోరారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న, లాస్య నందిత ఆశయ సాధన కోసం పని చేస్తానని ఆమె ప్రతినబూనారు. ఈ రోజు కంటోన్మెంట్ లోని గృహలక్ష్మీ కాలనీ లోని నివాసం లో బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ముందుగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం తెలియజేస్తూ గులాబీ శ్రేణులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. లాస్య నందిత హఠాన్మరణంపై కన్నీరుమున్నీరయ్యారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకురాలు ఇంత చిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందని ఊహించలేదన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఏదేమైనా ఈ కష్టకాలంలో సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని గులాబీ క్యాడర్ స్పష్టం చేశారు. లాస్య నందిత సోదరి, పార్టీ నాయకురాలు నివేదిత కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. లాస్య నందిత కంటే రెట్టింపు మెజార్టీతో నివేదితను గెలిపించుకుంటామని తెలిపారు. అనంతరం నివేదిత మాట్లాడుతూ గులాబీ క్యాడర్ అభీష్టానుసారం కంటోన్మెంట్ ఉప ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ హైకమాండ్ ను కలుస్తామన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడానికి ఇతర పార్టీలు కూడా సహకరించాలన్నారు. ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే బరిలో నిల్చుని, ప్రజలందరి ఆశీర్వాదాన్ని కోరుతానన్నారు. లాస్య నందిత లాగే తనను కూడా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని నివేదిత ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత ఫోటోకు పుష్పాంజలి సమర్పిస్తూ నివేదిత కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాన్ని చూసి గులాబీ శ్రేణులంతా చలించిపోయారు. ఆ తర్వాత అందరూ లాస్య నందిత చిత్ర పటానికి పూలు వేసి, కన్నీటి నివాళి అర్పించారు.
ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టి ఎన్. శ్రీనివాస్ అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ శ్యాంకుమార్, లోకనాథం, పలు వార్డుల బిఆర్ఎస్ అధ్యక్షులు, పలువురు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు, ఉద్యమ కారులు, స్వర్గీయ సాయన్న అభిమానులు, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి