ఆ ఉమ్మడి జిల్లా ఏది …ఆ హార్ట్ సీట్ గా మారిన పార్లమెంటు స్థానం ఏది…
లోక్ సభ ఎన్నికలు వేళ ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఓ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి హ్యాట్రిక్ కొట్టిన బి ఆర్ యెస్ మరో విజయం సాధించాలని భావిస్తుంటే, రాష్ట్రంలో అధికారం సాధించి దూకుడు మీదున్న కాంగ్రెస్ ఈ సారి విజయం మాదే అంటూ ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో మరోసారి బిజెపి పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో నన్ను గెలిపియ్యాలంటూ బిజెపి అభ్యర్థి కోరుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు ఎలాగైనా తమ పట్టును నిలుపుకునేందుకు అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ఇంతకు ఆ ఉమ్మడి జిల్లా ఏది… ఆ హార్ట్ సీట్ గా మారిన పార్లమెంటు స్థానం ఏదో ఇప్పుడు చూద్దాం.
పాలమూరు జిల్లా (Palamuru District) : ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు…
ఉమ్మడి పాలమూరు జిల్లా (Palamuru District) కాంగ్రెస్ పార్టీకి కంచుకోట గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలు.. అయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని రాజకీయ పార్టీలకు హాట్ సీట్ గా మారింది. దేశ రాష్ట్ర రాజకీయాల మార్పుకు తగ్గట్లు ఇక్కడి పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రజలు తీర్పు ఉంటుందన్న సెంటిమెంట్ తో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రేస్ ల నడుమే ప్రధాన పోటి ఉంటుండగా… ఎవరికి వారే గెలుపు పై ధీమాతో ఉన్నారు.
ఇక్కడి నుంచి గెలిచిన వారికి హస్తినాలో..
ఇక్కడ గెలిచిన వారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుండటం…. ఇక్కడి నుంచి గెలిచిన వారికి హస్తినాలో మంచి పలుకుబడి దక్కుతుండటంతో పాలమూరు (Palamuru District) బరిలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. షాద్ నగర్, మక్తల్, కొడంగల్, మహబూబ్ నగర్, నారాయణపేట, జడ్చర్ల, దేవరకద్ర, నియోజక వర్గాలు ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి.ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో 16 లక్షల 75 వేల మంది ఓటర్లున్నారు. ఇక్కడి నుంచి గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టిన వారంతా జాతీయ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు గడించిన వారే కావడం గమనించ దగ్గ విషయం.
ఉప ఎన్నికలతో కలిపి 17 సార్లు ఎన్నికలు…
1957 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలతో కలిపి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఏడు సార్లు కాంగ్రెస్ పొందింది. ఈ పార్లమెంట్ నుండి నాలుగు సార్లు మల్లికార్జున్ గౌడ్ విజయం సాధించారు. చివరి సారిగా 2004లో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. మళ్లీ 20 ఏండ్ల తర్వాత తిరిగి పాలమూరు పార్లమెంట్ ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. జే రామేశ్వర్ రావు, మూడు పర్యాయాలు మరియు జైపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డిలు రెండు పర్యాయాలు ఇక్కడి నుంచి గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టగా…. 2009 లో కేసీఆర్ ఇక్కడి నుంచి గెలుపొంది తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు.
అధిష్టానం బరిలో సిట్టింగ్ ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి…
ఈ సారి ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి ని అధిష్టానం బరిలో నిలపగా… బిజెపి నుంచి డికే అరుణ పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రేస్ పార్టి నుంచి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ చల్లా వంశీచంద్ రెడ్డి బరిలో వున్నారు… గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలే మరోసారి పోటీ పడుతున్నారు.ఇదిలా ఉంటే పాలమూరు (Palamuru District) సెంటిమెంట్ పై అన్ని రాజకీయ పార్టీలు కూడా ద్రుష్టి పెట్టాయి.ఇక్కడి నుంచి ఎంపిగా గెలిచిన వారందరు కేంద్రంలో చక్రం తిప్పిన వారే.స్థానిక ఎంపిగానే కేసీఆర్ రాష్ట సాధన ఆ తర్వాత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మాజీ ఎంపి అయిన జితేందర్ రెడ్డి కూడా లోక్ సభలో టీఆర్ ఎస్ పక్షనా ప్రతిపక్ష నేతగా గతంలో వ్యవహరించారు.
జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించిన వారు…
గతంలో ఎంపీలుగా గెలిచిన జైపాల్ రెడ్డి, మల్లిఖార్జున్ లు కేంద్ర మంత్రులుగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించిన వారు కావడంతో, ఇక్కడ గెలిస్తే జాతీయ స్థాయిలో ఫోకస్ లభిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. బరిలో నిలుస్తున్న నేతలు. అందుకే ప్రతిష్టాత్మకంగా భావించి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు ఎవరికి వారే గెలుపుపై లెక్కలు వేసుకుంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ పార్లమెంట్ పరిధిలోని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్దులే గెలుపొందారు. వీరందరికి కలిపి 1,00,439 మెజార్టి ఉంది. అందుకే సునాయాసంగా గెలుపొందుతామనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది.
100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామంటూ ప్రచారం…
మొన్నటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి 6,11514, బీఆర్ఎస్ పార్టీకి 5,11 017, బిజెపి పార్టీకి 1,12,000 ఓట్లు నమోదు అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో సవాల్ గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు ప్రచారని విస్తృతంగా చేస్తున్నారు. కేవలం 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపి కి టికెట్ ఇచ్చి రంగంలోకి దిగింది. కానీ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మూడు లక్షలకు పైగా మెజార్టితో గెలిపించుకుంటామని, పాలమూరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ సారి టిఆర్ఎస్ పార్టి అభ్యర్ది గెలుపొందితే అది ఆ పార్టికి నాలుగోసారి వరుసగా గెలుపొందినట్లుగా రికార్డు వుంటుంది.
బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పై కాంగ్రెస్ ఆశలు…
2009, 2014, 2019 ఇప్పుడు ఎలాగైనా సిట్టింగ్ స్థానాని కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎంపీగా మన్నే శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్లమెంట్ లో ఎవరు ప్రచారం చేయకపోవడం బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు అంత ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. 2019 మే నెలలో జరిగిన 17వ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మన్నె శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీగా విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డి.కె అరుణపై 56,404 ఓట్ల మెజారిటీతో శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారని తెలిసిందే.
బరిలో బిజెపి నుంచి మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ డికే అరుణ…
ఇక బిజెపి నుంచి మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న డికే అరుణ బరిలో నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో చివర్లో టికెట్ దక్కించుకొని గట్టి పోటీ ఇచ్చిన డీకే అరుణ ఈసారి ఎలాగైనా గెలువాలని కసరత్తు చేస్తోంది. ఇక్కడ ఎంపీగా గెలుస్తే కచ్చితంగా కేంద్రంలో మంచి పదవీ వస్తుందని, గెలుపే లక్ష్యం గా పని చేస్తోంది… మొన్నటి వరకు బిజెపి టికెట్ వస్తుందని ఆశించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బిజెపి పార్టీకి రాజీనామా చేయడంతో పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణనే కీలకపాత్ర పోషిస్తుంది… బిజెపి శ్రేణులు కూడా కొత్త జోష్ తో ఈ ఎన్నికలకు పోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రేస్ పార్టిలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిచయాలు, తనతో పాటు కమలం గూటికి చేరిన అనుచరవర్గంతో పాటు హర్డ్ కోర్ బిజెపి క్యాడర్ కలిసొస్తుందని భావిస్తున్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం తమకు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు…
గతంలో ఎంపి గా పోటి చేసిన అనుభవం, బిజెపి అధిష్టానం కూడా ఈ సీట్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటం గెలుపు పై అంచనాలు పెంచుతున్నట్లు చెప్పవచ్చు. 1999 ఎన్నికల్లోనే ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్న బీజేపీ, 2019 ఎన్నికల్లో 3 లక్షలకు పైచిలుకు ఓట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఈసారి మోడీ ఇమేజ్‌కు తోడు అయోధ్యలో రామాలయ నిర్మాణం తమకు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో వుంటుందని కచ్చితంగా 7 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వున్నారు. దీంతో గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వంశీచంద్ రెడ్డి అభ్యర్దిత్వాన్ని మరోసారి పార్టీ ఖరారు చేసిన హస్తం పార్టి అధిష్టానం.
పాలమూరు జిల్లా (Palamuru District)లో సాంప్రదాయ ఓటు బ్యాంకు…
కాంగ్రెస్ కంచుకోట గా పేరున్న పాలమూరు జిల్లా (Palamuru District) లో సాంప్రదాయ ఓటు బ్యాంకు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండటంతో ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలే వస్తాయనే భావనతో కాంగ్రేస్ శ్రేణులు ముందుకు పోతున్నాయి. ఇటీవల ఆయా నియోజకవర్గాలలో వుండే ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీల్లో చేరుతుండటం కొంత వరకు గెలుపు పై ధీమా గా వుంది. హాట్ సీట్ గా మారిన పాలమూరు బరిలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి. ఓటరు తీర్పు ఎవరిని హస్తినకు పంపుతుందో , ఎవరిని ఇంటికి పరిమితం చేస్తుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇది చదవండి : డీ మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో చచ్చిన ఎలుక కలకలం..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఆ ఉమ్మడి జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయం…