శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.10 నిమిషాలకు ఆలయ ప్రాంగణంలో స్వామి వారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరించినున్నారు. బ్రహొత్సవాలను పురస్కరించుకుని సాయంత్రం శ్రీకాళహస్తి దేవస్థానం వారి తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పించనున్నారు. ఈ నెల 11వ తేది వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 5న రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సాయంత్రం 5గంటలకు స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం జరుగుతుంది. రాత్రి 10 గంటలకు స్వామికి లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12 గంటలకు బ్రహ్మోత్సవ కల్యాణం కార్యక్రమాలు వైభవంగా జరుగనున్నాయి. 9న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. 11న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మార్చి 5 వరకు ఇరుముడి కలిగిన శివదీక్షా భక్తులకు మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం ఉంటుందన్నారు. సాధారణ భక్తులు శ్రీ స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనం ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో ప్రతి రోజూ స్వామి అమ్మవార్లకు వాహనసేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో పెద్దిరాజు వెల్లడించారు.