మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన ఆర్కే స్పీకర్ కార్యాలయానికి వెళ్లి సభాపతి కార్యదర్శికి ఆ లేఖను అందజేశారు. మంగళగిరి వైసిపి ఇన్ఛార్జ్గా గంజి చిరంజీవికి ఆ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఆర్కే అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా అనంతరం ఆర్కే మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి, వైసిపికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని తెలిపారు. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖను అందజేశానని దీన్ని ఆమోదించాలని స్పీకర్ను కోరినట్లు తెలిపారు. రాజీనామాకు గల కారణాలను త్వరలో తెలియజేస్తానని ఆర్కే తెలిపారు. అయితే, అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా
115
previous post