స్వాతంత్రం సిద్ధించి నేటికీ 75 ఏళ్లు అయినప్పటికీ గిరిజన ప్రాంతాలకు విద్య వైద్య సౌకర్యాలు కనుచూపు మీద కనిపించడం లేదు. గర్భిణీ స్త్రీలు ప్రసవవేదన సమయంలో దవాఖానాలకు వెళ్ళాలంటే డోలు కట్టి మనుషులు మోసుకుని వెళ్లాల్సిన దుర్భర పరిస్థితిలో నేటికీ ఉన్నాయంటే మనం ఎంత అభివృద్ధిలో ఉన్నామో చెప్పకనే తెలుస్తుంది. అటువంటి హృదయ విధానకరమైన సంఘటన కుక్కునూరు మండలం జిన్నెలగూడెం గ్రామంలో గణతంత్ర దినోత్సవం నాడు చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే కుక్కునూరు మండలం జిన్నెలగూడెం అనే వలస గిరిజన గ్రామంలో జనవరి 26 శుక్రవారం కూరం కోసి అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుంది. ఆ గ్రామానికి రహదారి సౌకర్యాలు ఏమి లేకపోవడంతో 108 కి ఫోన్ చేసిన ప్రయోజనం లేకపోయింది. కనీసం ద్విచక్ర వాహనం వెళ్లేందుకు కూడా అవకాశం లేదు. దీంతో ఆ గ్రామస్తులు డోలి కట్టి ఆ గర్భిణీ మహిళను నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న బర్ల మడుగు గ్రామం వరకు మోసుకుని వెళ్ళాల్సి వచ్చింది. అనంతరం అక్కడినుండి వాహనం ద్వారా ప్రయాణించి ప్రసవించాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు దశాబ్దాల క్రితం బతుకుదెరువు కోసం చతిస్గడ్ రాష్ట్రం నుండి గిరిజనులు అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కుక్కునూరు మండలంనకు వలస వచ్చారు. అప్పటినుండి తమ గిరిజన గ్రామానికి రహదారి విద్యా వైద్య సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు మొత్తుకుంటున్నా తమ గ్రామానికి ఏమి ప్రయోజనం కలగలేదని, దీంతో 75వ గణతంత్ర దినోత్సవం నాడు గర్భిణీ మహిళ ప్రసవవేదనతో బాధపడుతున్న దౌర్భాగ్యం పరిస్థితుల మధ్య మా గ్రామం ఉందని వలస గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయపై సిపిఐ కుక్కునూరు మండల కార్యదర్శి మైసాక్షి వెంకటాచారి మాట్లాడుతూ.. రెండు దశాబ్దాల క్రితం పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం వలస వచ్చిన గిరిజనులు కడు దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని, వలస గిరిజన గ్రామాల్లో రహదారి విద్యా వైద్య సౌకర్యాలు, ఉపాధి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఉన్నతాధికారులకు పలు సార్లు వినతి పత్రాలు, ధర్నాలు రాస్తారోకోలు, వివిధ రూపాల్లో తమ అవసరాలను గుర్తు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కలగలేదని ఆయన అన్నారు. తమ వినతులను అధికారులు పట్టించుకోకపోవడం వల్ల గణతంత్ర దినోత్సవం నాడు ప్రసవం కోసం గిరిజన మహిళను డోలు కట్టి మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వలస గిరిజన గ్రామాలకు విద్యుత్, విద్య, వైద్యం, రహదారి, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వలస గిరిజన గ్రామాల్లో అనేకమంది డిగ్రీ, పీజీ చేసిన విద్యార్థులు ఉద్యోగాలు లేక వ్యవసాయ పనులు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఛత్తీస్ ఘడ్ గిరిజనులకు ఎస్టి కుల దృవీకరణ పత్రాలు ఇవ్వటానికి ఇక్కడ అధికారులు నిరాకరించడంతో వారికి ఉద్యోగ అవకాశాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వలస గిరిజనుల పట్ల సహృదయంతో వ్యవహరించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాల కొరకు ఎస్టి కుల దృవీకరణ పత్రాలు కూడా ఇవ్వాలని వెంకటాచారి డిమాండ్ చేశారు.
డోలి కట్టి ఆసుపత్రికి తరలింపు..
60
previous post