లోక్‌సభ లో కొందరు దుండగులు చొరబడి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సభా కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి గ్యాలరీ నుంచి కిందకు దూకుతూ నినాదాలు చేయగా.. మరోవ్యక్తి ఒకరకమైన పొగను వదలడం కలవరం సృష్టించింది. ఇదే సమయంలో పార్లమెంటు బయట మరో ఇద్దరు దుండగులు ఈ తరహాలోనే ఆందోళనలు చేశారు. వీరందర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లోక్‌సభ లోపల పట్టుబడిన వారు కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, దేవ్‌రాజ్‌లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ మైసూర్‌కు చెందినవారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. పార్లమెంటు బయట నిరసన చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. రంగుల పొగను వెదజల్లుతూ ఆందోళనకు దిగిన వీరిద్దరినీ ట్రాన్స్‌పోర్టు భవనం ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న మహిళ హరియాణాలోని హిసార్‌కు చెందిన నీలం కాగా, మరో వ్యక్తి మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన అమోల్ శిందే గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. పార్లమెంటు లోపల, వెలుపల జరిగిన ఈ ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దర్యాప్తు చేస్తుందని అధికారులు వెల్లడించారు. లోపలికి చొరబడిన ఇద్దరు వ్యక్తులు ఓ ఎంపీ సిఫార్సుతోనే లోనికి చేరినట్లు తెలుస్తోంది. అయితే, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ వాయువును వెదజల్లే గొట్టాలను లోనికి ఎలా తీసుకెళ్లారనే విషయం మిస్టరీగా మారింది. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని పలువురు ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. కాగా, 2001 లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది. ఈ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజు ఆగంతుకులు లోక్ సభలో చొరబడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.