ఎంపీ గా కొట్లాడే అవకాశం ఇవ్వండి – తాటిపర్తి జీవన్ రెడ్డి (Thatiparthi Jeevan Reddy)
జగిత్యాల పట్టణం అంగడిబజార్లోని జగిత్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ అడువాల జ్యోతిలక్ష్మణ్ నివాసంలో మంగళవారం పద్మశాలి సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి (Thatiparti Jeevan reddy)హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల ప్రజల రుణం తీర్చుకోలేనిది.. యుద్ధంలో కొట్లాడేందుకు ఓటు హక్కుతో అవకాశం ఇవ్వండి.. ప్రజల తరుపున కొట్లాడుతానని అన్నారు. జగిత్యాల అభివృద్ధికి చేయి చేయి కలువండి.. నా ప్రతి విజయంలో జగిత్యాల పట్టణ ప్రజల మద్దతు ఉందని గుర్తు చేసుకున్నారు. 1996లో రాజకీయాలకు అతీతంగా 54వేలకుపైగా మెజార్టీ తో గెలిచానని అన్నారు. అందరికి ఆపదలో అందుబాటులో ఉండి సేవలందిస్తానని అందరూ తమ బిడ్డగా భావించి, ఎన్నికల్లో అండగా నిలిచారు. ఆపదలో ఉన్న వారికి నా వంతు సాయం అందించానని, సమస్య పరిష్కారం కోసం మార్గం చూపుతున్నానని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సమస్యల పరిష్కారం కోసం వారధిగా పనిచేసే అవకాశం ఉంది. ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే మరింత మెరుగైన సేవలందిస్తా.. గతంలో జగిత్యాల సమీపంలోని శంకుపల్లి, తిప్పన్నపేట, గోపాల్రావుపేట, పెర్కపల్లి వంటి గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి తాను గెలిచిన తర్వాత జగిత్యాల వరిసర గ్రామలన్నింటికి విద్యుత్ సౌకర్యం కల్పించానని గుర్తు చేశారు. పనిచేయాలనే సంకల్పంతో మూడు నెలల్లో విద్యుత్ సౌకర్యం కల్పించానన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రతిసారి జగిత్యాల అభివృద్ధికి కృషి చేసిన. జగిత్యాల బైపాస్ రోడ్డు వేసిన, ఊరూరా తారు రోడ్డు వేసిన, ఉమ్మడి రాష్ట్రంలో జెఎన్టీయూ కళాశాల కేవలం జగిత్యాలకు తీసుకువచ్చామన్నారు. వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేసిన. తెలంగాణ ప్రాంతీయ కేంద్రం న్యాక్ కేంద్రాన్ని జగిత్యాలలో ఏర్పాటు చేసిన, హైదరాబాద్ తర్వాత 4000 ఇళ్లు మంజూరు పొందింది కేవలం జగిత్యాల పట్టణం మాత్రమే. 2008-09లో ఇల్లులేని నిరుపేదలందరికి ఇల్లు మంజూరు చేయాలనే సంకల్పంతో 90 గజాల స్థలంలో ఇల్లు నిర్మించి, శాశ్వత వంశపారంపర్యంగా ఆస్తి పొందే అవకాశం కల్పించిన.
వైఎస్ రాజశేఖర్ పాలనలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన. దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నిత్యం పార్టీలకతీతంగా అందరిని కలుసుకొని, నమస్యలు తెలుసుకొని పరిష్కరించారు. తాను జగిత్యాల మున్సిపాలిటీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని దృష్టికి తీసుకెళ్లడంతో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎస్సారెస్పీ కాలువతో ధర్మసముద్రం చెరువు నింపేలా అనుసంధానం చేసినం. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం జగిత్యాల మున్సిపాలిటీ మాత్రమే ప్రతి ఇంటికి తాగునీరు అందించింది. జగిత్యాల పట్టణంలో తాగునీటి సమస్య ఏర్పడకుండ, నిత్యం తాగునీరు సరఫరా చేయాలనీ సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు.
జగిత్యాల పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడకుండ చర్యలు చేపట్టవలసిన బాధ్యత మున్సిపల్ చైర్‌పర్సన్‌పై ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికి, గ్రావిటీ ద్వారా సుమారు 10టీఎంసీల నీటిని ఎస్సారెస్పీ నుండి తరలించడంతో నీటి మట్టం తగ్గిందని, రబీలో సాగునీరు సరఫరా చేసేందుకు నీటి కొరత ఏర్పడినప్పటికి వంటలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందరిని ఒప్పించి, మెప్పించి, 40ఫీట్ల రోడ్డును యావర్ రోడ్డును 60 ఫీట్లకు విస్తరించామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (Jeevan reddy) గుర్తు చేశారు. ఎంపీ కవిత ఎంపీగా, ముఖ్యమంత్రి తనయగా యావర్ రోడ్డు విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నప్పటికి జగిత్యాల ఎమ్మెల్యేకు పేరు వస్తుందని పట్టించుకోలేదు.
యావర్ రోడ్డు విస్తరణకు రూ.100కోట్లయినా కేటాయించి, విస్తరిస్తాం..
2017లో యావర్ రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు చేస్తే, కాంగ్రెస్‌కు పేరు వస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ యావర్ రోడ్డు విస్తరణకు ఉత్తర్వులు జారీ చేయలేదని విమర్శించారు. అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండగా, ఎన్నికల్లో యావర్ రోడ్డు విస్తరణను తానే అడ్డుకుంటున్నానంటూ విష ప్రచారం చేశారు. ఎన్నికల్లో యావర్‌రోడ్డును ఒక అస్త్రంగా వాడుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాత్రమే యావర్ రోడ్డు విస్తరణ చేపట్టారు. పరిహారం చెల్లించేందుకు కేవలం రూ.50కోట్ల నిధులు విడుదల చేయకుండ యావర్ రోడ్డు పనులు చేపట్టలేదు. రూ.100కోట్లు అయినా నిధులు కేటాయించి, యావర్ రోడ్డు విస్తరణ చేపడుతానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అర్ధాంతరంగా నిలిచిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తే జీవన్‌రెడ్డి (Jeevan reddy) పేరు వస్తుందనే అక్కసుతో, ఇళ్లను నిలిపివేసి, డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణం తెరపైకి తీసుకువచ్చారు. డబుల్ ఇళ్ల లబ్దిదారులతో ఎన్నికల్లో లబ్ది పొందారు.
డబుల్ ఇళ్లలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని మూడు నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మూడుసార్లు కలిసిన, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఐదేళ్లలో కేసీఆర్‌ను ఎన్నిసార్లు కలిశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతపార్టీ, ప్రజా సమస్యల పరిష్కారం ఎవరైనా కలిసే స్వేచ్ఛ ఉంది. మాజీ సీఎం కేసీఆర్‌తో చనువుగా ఉండి కూడా యావర్ రోడ్డు విస్తరణ కోసం కేవలం రూ.50కోట్లు ఎందుకు తీసుకురాలేకపోయారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. దసరాలోపల యావర్ రోడ్డు విస్తరణ చేపడుతామని భరోసా ఇచ్చారు. పరిహారం చెల్లించి, విస్తరణ చేపడుతాం. 4000 ఇళ్ల స్థలాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
జగిత్యాల నుండి ఢిల్లీకి రైల్వే లైను వేయిస్తా..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో పులివెందులతో పోటీపడి జగిత్యాలను అభివృద్ధి చేసిన. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్ తో పోటీపడి జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎంపీగా గెలిస్తే జగిత్యాల నుండి మంచిర్యాల మీదుగా ఢిల్లీకి రైల్వే లైను వేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా అభివృద్ధి ఎందుకు చేయలేదని ఎంపీ అర్వింద్‌ను ప్రశ్నించారు. చక్కెర కర్మాగారం పునరుద్ధరించాలని చిత్తశుద్ధి ఉంటే చేసేవారని, చిత్తశుద్ధి కొరవడడంతోనే పున: ప్రారంభించలేదని విమర్శించారు. జగిత్యాల అభివృద్ధి జీవన్‌రెడ్డి తో మాత్రమే సాధ్యమని అన్నారు. కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
గీతాకార్మికులకు వేలం పద్ధతి రద్దు చేసి. వాడితే చెట్టు అని, వారికి హక్కులు కల్పించినం. చేపలు పట్టే వారికి చెరువులు, కుంటలపై హక్కులు కల్పించినం. వృత్తివరంగా అవకాశం లేనటువంటి వారికి స్వయం ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలి. భారత రాజ్యాంగం బలహీన వర్గాలకు కేటాయించిన హక్కులు వారికే చెందాలనే సంకల్పంతో బలహీన వర్గాలకు కేటాయించిన జగిత్యాల మున్సివల్ చైర్పర్సన్ పదవి వారికే దక్కేలా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మున్సిపల్ చట్టంలో మార్పులు చేపట్టి, బలహీన వర్గాల మహిళకు పదవి దక్కేలా కృషి చేశానన్నారు. గత ప్రభుత్వ పాలనలో చట్టంలో మార్పులు చేసేలా అవకాశం ఉన్నా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎందుకు కృషి చేయలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని బలహీన వర్గాల హక్కులను కాపాడానని సంతృప్తి మిగలిందన్నారు. తొలి, మలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ యావత్ తెలంగాణకు గర్వకారణమన్నారు. బలహీన వర్గాల మీ హక్కుల సాధన కోసం కృషి చేస్తా. పద్మశాలి యువకులకు స్వయం ఉపాధి కోసం కనీసం రూ.500కోట్లు కేటాయించాలన్నారు. మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో… మీరిచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో బిజెపి నాయకులు గుండెలపై చేతులు వేసుకొని, ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకు వచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15లక్షలు చేస్తామని చెప్పి, వేశారా అని నిలదీశారు. ప్రభుత్వం వ్యాపారసంస్థగా మారింది. ప్రజా సంక్షేమం విస్మరించింది అని విమర్శించారు. నిత్యావసర ధరల పెరుగుదలకు మోడీ పాలనే కారణం.
ఇది చదవండి: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి