ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గ పరిధిలో ఈ రియల్ మట్టి మాఫియా నడుస్తోంది. శాండ్, సిలికా అక్రమ తవ్వకాలు ఇక్కడ జరుగుతుంటే, కనక పట్టణమైన కావలిలో గ్రావెల్ మాఫియా నడుస్తోంది. అధికార పార్టీ నేతల అండదండలతో వారి అనుచరులు ఈ మాఫియాను పెంచి పోషిస్తున్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు, కోట మండలాల్లో విస్తారంగా సిలికా మినరల్ ఉంది. దీనికి దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఆటో మొబైల్ ఇండస్ట్ర్రీ, పౌండరీలు, గ్లాస్ కంపెనీలు, చిప్ ఇండస్ట్రీలు… ఇలా అనేక విలువైన వస్తువుల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. అందుకే ఎంతో విలువైన మినరల్ కు ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకున్న మాఫియా డాన్లు, ఈ ప్రకృతి సంపదను దోచే పనిలో నిమగ్నమైపోయారు. అంతేకాదు ప్రత్యేకంగా డంపింగ్ యార్డులు రూపొందించుకుని, అక్రమంగా తవ్విన సిలికాను గుట్టుచప్పడు కాకుండా తరలించేస్తున్నారు.
సాధారణంగా మైన్ను లీజుకు తీసుకోవాలంటే అనేక నిబంధనలు ఉన్నాయి. ఎమ్మార్వో ఎన్.ఓ.సి, జిపిఎస్ సర్వే, హెక్టారుకు 25వేల ఛలానా, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించడం వంటి అనేక నిబంధనలు ఉన్నాయి. అయితే మైన్ లీజుకు తీసుకున్న వారిని ఈ మాఫియా బెదిరించి, వారికి టన్నుకు కేవలం 100 నుంచి 150 రూపాయలు మాత్రమే చెల్లించి, బలవంతంగా తమ దందాను యధేశ్చగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో వీరు ఆడిందే ఆట… పాడిందే పాటగా తయారైంది. ఇలా చిల్లకూరు, కోట మండలాల్లోని మోమిడ, బల్లవోలు, వేళ్లపాలెం, మన్నెగుంట, సిద్ధవరం, కొత్త పట్నం, తమ్మిన పట్నం, వరగలి గ్రామాల్లో అక్రమ తవ్వకాలు యధేచ్చగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు, అటవీ భూములు, పొలాలకు నీరందించే కాలువలను సైతం అక్రమార్కులు వదలడం లేదు.
ఇలా ఇష్టానుసారంగా అక్రమంగా చేసిన మైనింగ్ నుంచి తీసిన లక్షల టన్నుల సిలికాను మాఫియా ముఠా… రామిరెడ్డి పాలెం, చింతవరం, కలువ కొండ, తిక్కవరం, పాలిచెర్ల పాలెం, గ్రామాల్లో అనుమతులు లేని డంపింగ్ యార్డులకు తరలించి కోట్లు గడిస్తున్నారు. అంతేకాదు మైన్స్ లీజు టైమ్ అయిపోయిన తరువాత కూడా ఇక్కడ మైనింగ్ జరుగుతుందంటే వారు ఎంతకు బరితెగించారో అర్థమవుతోంది. ఎస్.కృష్ణారెడ్డి 5 లక్షల టన్నులు, వినయ్ కుమార్ రెడ్డి 2 లక్షల టన్నులు, కోహినూర్ మైన్స్ 8 లక్షల టన్నులు, జనాకీరామరెడ్డి 6 లక్షల టన్నులు, సాయి చిన్నమ్మ మైన్స్ 3 లక్షల టన్నులు నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా సిలికా తవ్వకాలు జరిపారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతలా బరితెగించి, లక్షల టన్నుల అక్రమ సిలికా మినరల్ రాష్ట్రం దాటి పోతుంటే అధికారులు ఏమి చేస్తున్నారనేగా మీ డౌట్.. కెజిఎఫ్ సినిమాలోనూ, పుష్ప సినిమాలోనూ అక్రమంగా తరలి వెళ్లే ప్రకృతి సంపద విషయంలో అధికారులు, పోలీసులు ఏమి చేశారో ఇక్కడ కూడా అదే చేస్తున్నారు మైనింగ్ అధికారులు.
గతంలో జిల్లాలో ఉన్న 78 మైన్లపై ఐఏఎస్ స్థాయి అధికారులు తనిఖీలు చేసి భారీగా పెనాల్టీలు విధించేవారు. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో డిప్యూటేషన్ అధికారులు రాకతో పరిస్థితులు మారిపోయాయి. మైనింగ్ శాఖ ఉన్నతాధికారులే మైన్ల లీజు దారులను పిలిచి, ఒక టన్నుకు 100 రూపాయలు ఇస్తామని హుకూం జారీ చేశారు. ఇలా లీజు దారుల నుంచి మైన్లు లాక్కుని, తమ బినామీలకు అప్పజెప్పి మిగిలిన అన్నీశాఖల అధికారులను మేనేజ్ చేసి, పూర్తి స్థాయిలో తనిఖీలకు స్వస్తి చెప్పి….మాఫియాను నడపడం ప్రారంభించారు. ఎవరైనా నిజాయితీ గల అధికారి ఇది తప్పు అని ప్రశ్నిస్తే, ఆ అధికారిని తమకున్న పలుకుబడితో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు. శంకరిగిరి మాన్యాలను పట్టించడంతో మైన్స్ మాఫియా కొంగొత్త క్రీడకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చేతికే పవర్ ఇచ్చారు. ఇంకేముంది మైనింగ్ అధికారులు ఈ మాఫియాను తమ కనుసన్నలతో శాసిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.