కరీంనగర్- హసన్‌పర్తి రైల్వే లైన్‌కు సంబంధించి సర్వే పనులు పూర్తయ్యాయని, అతి త్వరలోనే రైల్వే లేన్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. నగరంలోని ఆర్టీసీ వర్క్ షాప్ ఎదురుగా వున్న పద్మశాలి భవన్ లో ఆ సంఘం అఫీషియల్స్, ప్రొఫెషనల్స్, యూత్ అసోసియేషన్స్ వేర్వేరుగా రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను బండి సంజయ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చానన్నారు. ప్రజల కోరిక మేరకు కరీంనగర్ .. హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ కు సంబంధించి సర్వే పనులు కూడా పూర్తయ్యాయని, అతి త్వరలోనే రైల్వే పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. కొంతమంది ఏమీ చేయకపోయినా తామే తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని, వాటిని నమ్మి మోసపోవద్దని సూచించారు. ఒక వర్గం ఓట్ల కోసం పాకులాడితే 2014, 18, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచి వాడమన్నారు. కానీ తనకు ధర్మమే ముఖ్యమని, హిందూ ధర్మ రక్షణ కోసం ఎంతవరకైనా వెళతానే తప్ప ఓట్ల కోసం పాకులాడబోనని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కుల వృత్తులకు, కుల సంఘాల అభ్యున్నతికి పైసలిచ్చేందుకు వెనుకాడే రాష్ట్ర ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న, మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న తబ్లిగ్ జమాతే వంటి సంస్థలు నిర్వహించే సభలు, సమావేశాలకు రూ.3 కోట్ల నిధులు కేటాయించడం సిగ్గు చేటన్నారు. ఇకనైనా హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, రాబోయే రోజుల్లో జరగబోయే అనర్ధాన్ని అర్ధం చేసుకోవాలని కోరారు. దేశం సురక్షితంగా ఉండాలంటే, ప్రజలకు ఉపయోగపడే అనేక చట్టాలు కార్యరూపం దాల్చాలంటే బీజేపీ గెలుపు అనివార్యమని అన్నారు. భారత పౌరులంతా దేశంలో ఎక్కడికైనా వెళ్ళి స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని నివసించే అవకాశం ఉంటుందని, వివాహాలు చేసుకునే అవకాశం ఉందని చెప్పిన బండి సంజయ్ కాశ్మీర్ లో మాత్రం ఆ అవకాశం లేకుండా కాంగ్రెస్ పాలకులు చేశారన్నారు. భారతీయులందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే మోదీ అభిమతమన్నారు.