రాష్ట్రంలో పేరుకుపోయిన భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వానికి మధ్యంతర నివేదికలు అందించనున్నట్లు ధరణి కమిటీ సభ్యులు తెలిపారు. తుది నివేదిక ఇచ్చే వరకు వేచి చూడకుండానే ఎప్పటికప్పుడు సూచనలు, సిఫార్సులను అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. ధరణి కమిటీ తొలి సమావేశం సచివాలయంలో జరిగింది. అనంతరం సచివాలయం మీడియా కేంద్రంలో కమిటీ సభ్యులు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, న్యాయవాది సునీల్‌కుమార్‌లు సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కోదండరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ మ్యానిఫెస్టోలోనూ ధరణి అంశాన్ని చేర్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఆయన నిశితంగా దృష్టిసారించారు. కమిటీ ఏర్పాటు చేశారు. వాస్తవానికి నిజాం కాలంలోనూ రెవెన్యూ వ్యవస్థ ఎంతో బాగుంది. అనంతరం కూడా రికార్డుల నిర్వహణ సజావుగా కొనసాగింది. కానీ గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చింది. పట్టాభూములు, భూదాన్, ఎసైన్డ్, వక్ఫ్, అటవీ భూముల్లోనూ సమస్యలు ఏర్పడ్డాయి. పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. సాగులో ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో భూ సమాచారం లేక ఎన్నో ఏళ్లుగా హక్కులు కోల్పోయి ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. భూ సమస్యల వివాదాలతో హైదరాబాద్ నగర శివారులో ఒక మహిళా తహసీల్దారును సజీవ దహనం చేసిన సంఘటన చోటుచేసుకుంది. హక్కుల కోసం తిరుగుతూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని పేర్కొన్నారు. రెండో విడత సమావేశం ఈ నెల 17న జరుగుతుందని లచ్చిరెడ్డి తెలిపారు.
Read Also..