సంక్రాంతి పండుగకు కుమార్తె వద్దకు వెళ్తూ అదృశ్యమైన వృద్ధురాలు దారుణహత్యకు గురైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం కల్వకుర్తి మండలం తర్నికల్‌కి చెందిన నాగమ్మ(60)కు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం కొడుకుల వద్ద ఉంటున్న ఆమె సంక్రాంతి కావడంతో వంగూరు మండలం ఉల్పరలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు మంగళవారం కల్వకుర్తి వచ్చారు. బస్సు కోసం బస్టాండులో వేచి ఉండగా గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లాడు. నాగమ్మ రాత్రయినా కుమార్తె ఇంటికి చేరుకోపోవడంతో మరుసటి రోజు అంతా వెతికినా ఫలితం లేకపోయింది. కుటుంబ సభ్యులు బుధవారం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. అందులో నిక్షిప్తమైన దృశ్యాలతో నిందితున్ని గుర్తించినట్లు సమాచారం. అనుమానితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించనట్లు తెలిసింది. హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు. అచ్చంపేట సమీపంలో నల్లమల అడవుల్లో మృతదేహాన్ని పడేసి గుర్తుపట్టకుండా నిప్పటించాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహానికి అచ్చంపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలాంటి మరో కేసులో నిందితునిపై అనుమానాలు ఉండటంతో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
అదృశ్యమైన వృద్ధురాలి దారుణ హత్య…
72
previous post