తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో నిజం గెలవాలి యాత్ర చేపట్టారు.
చంద్రబాబు అరెస్ట్ అనంతరం జేపీ అగ్రహారం గ్రామంలో మరణించిన టీడీపీ కార్యకర్త సుర్ల దేవుడమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ఆర్థికసాయం చెక్ అందించారు. గంపవానిపాలెం గ్రామంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త మాకిరెడ్డి పెద్దమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థికసాయం తాలూకు చెక్ అందించారు. సభలో ఆమె ప్రసంగిస్తూ టీడీపీ కార్యకర్తలకు కర్తవ్యబోధ చేశారు. సైకిల్ కు ఎదురులేదని, ఎవరు అడ్డొచ్చినా లెక్కచేయొద్దని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారు. మనం మన హక్కుల్ని సాధించడం కోసం సైకిల్ ని గెలిపించుకోవాలి.
తెలుగుదేశం జెండాను ఎగరేయాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ప్రజల కోసం చేసే పోరాటంలో సైకిల్ కి ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్లి పోవాలి… పసుపు సైనికులు ఎక్కడా వెనక్కి తిరిగి చూడవద్దు. గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేసింది. చంద్రబాబు 2019లో ముఖ్యమంత్రి అయ్యుంటే అమరావతి పూర్తి చేసేవారు. జగన్ 3 రాజధానులు అని ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే… మన రాజధాని అమరావతే. ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం… వైసీపీ చేతిలో నుండి ఏపీని కాపాడుకుందాం” అంటూ నారా భువనేశ్వరి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.