వేములవాడ రాజన్న (Vemulawada Rajanna Temple) గుడికి పోటెత్తుతున్న భక్తులు
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలువబడుతున్న వేములాడ రాజన్నను దర్శించుకునే భక్తులు రాజన్న ప్రసాదాలపై అంతే మక్కువ చూపుతారు. మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నాలుగు నుంచి ఐదు లక్షల మంది వస్తారన్న అంచనాల్లో అధికార యంత్రాంగం ఉంది. భక్తులకు రాజన్న లడ్డూ ప్రసాదం అందించేందుకు ఆలయ ప్రసాదాల గోదాం ఇన్‌చార్జీలు రెండురోజులుగా పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం ఉన్న లేబర్‌కు తోడు మరింత మందిని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గోదాంలోని ఓ గది నిండా ట్రేలలో తయారు చేసిన లడ్డూలు సిద్ధం చేశారు. 2 లక్షల 50 వేల లడ్డూలు సిద్ధం, 10 క్వింటాల పులిహోర చేసి ఉంచుతామని, 7, 8, 9 తేదీల్లోనూ భక్తుల రద్దీని బట్టి మరో లక్ష లడ్డూల వరకు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత శివరాత్రి జాతరలో 3 లక్షల పైగా లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగినట్లు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రాజన్న లడ్డూ ప్రసాదం రుచిగా ఉండేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ అందుకు అనుగుణంగా దిక్టం (ప్రసాదాల్లో వాడే వస్తువుల కొలతలు) రూపొందించింది. దీని ప్రకారం స్వచ్ఛమైన నెయ్యి, నాణ్యమైన శనగపప్పు, కాజు, మిష్రి, కిస్‌మిస్, బాదాం, యాలకులతో పాటు సుగంధ ద్రవ్యాలను సైతం ఇందులో పొందుపరుస్తుండటంతో రాజన్న లడ్డూ తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. మార్కెట్లో చక్కెర ధర అధికంగా ఉన్నా భక్తులకు తక్కువ ధరకే లడ్డూ ప్రసాదం అందించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర దేవాదాయశాఖ రూ.20కు ఒక లడ్డూ చొప్పున విక్రయించాలని ఆదేశించింది. ఆమేరకు ప్రసాదాల విక్రయాల కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదం అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రాజన్నను దర్శించుకుని దక్షిణ ద్వారం గుండా బయటకు వెళ్లే భక్తులు నేరుగా ప్రసాదాల కౌంటర్‌కు చేరుకుని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.
ఇది చదవండి: బుల్లెట్ మంత్రిగా మారిన అంబటి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి