స్పష్టమైన మెజారిటీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనపై దృష్టిసారించింది. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో వడివడిగా పాలనాపరమైన అడుగులేస్తోంది. ఈ క్రమంలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని జ్యోతిబా పూలే ప్రజాభవన్ నుంచి ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీకి మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ప్రజాభవన్ సీఎం క్యాంప్ కార్యాలయంగా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తుండడంతో సీఎం క్యాంప్ ఆఫీస్‌ను మరో చోటకు మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో గుట్ట మీద ఉన్న బ్లాక్‌లోకి మార్చాలని, ఈ మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. సోమవారం ఎంసీఆర్‌హెచ్ఆర్డీ, ప్రభుత్వ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి సీఎం క్యాంపు ఆఫీస్ తరలింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీని సందర్శించారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి తరలిస్తే రేవంత్ రెడ్డి నివాసానికి చాలా దగ్గర అవనుంది. సీఎం నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు ఆయన వెళ్తున్నారు. ఒకవేళ ఎంసీఆర్‌హెచ్ఆర్డీకి క్యాంప్ ఆఫీస్‌ను మార్చితే దూరం చాలా వరకు తగ్గనుంది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో అక్కడ తగిన వసతులు కూడా ఉన్నాయి. దీంతో అక్కడ ఏర్పాటు చేస్తే అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
అధికారులతో సమావేశమై నేడు తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్
59
previous post