YSRCP :
రాజకీయాల్లో మత్స్యకారుల తరుపు ప్రతినిధిగా కొనసాగుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఏనాడూ ఆ వర్గం ప్రయోజనాలు కోసం పని చేసిన దాఖలాలు లేవని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి విమర్శించారు. అధికారం ఉన్నంతసేపూ తన స్వప్రయోజనాల కోసమే మత్స్యకారులను వాడుకున్నారని ధ్వజమెత్తారు. స్థానిక వైస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కుటుంబాన్ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా వక్రీకరించి మత్స్యకార జాతిని అవమానించినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ద్వారంపూడి మండిపడ్డారు. మత్స్యకార ప్రాంతాల నుంచి తనకు ఏనాడూ మెజార్టీ రాకపోయినా రాజకీయాలను పక్కన పెట్టి, వీరి అభ్యున్నతికి ఎంతో కృషి చేశానన్నారు. మత్స్యకార వర్గం నుంచి కర్రి పద్మశ్రీకి ఎమ్మెల్సీ, బందన హరికి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్, చోడిపల్లి ప్రసాద్‌కు డిప్యూటీమేయర్ పదవి రావడానికి కృషి చేశానన్నారు. మత్స్యకార వర్గానికి చెందిన మల్లాడి సత్యలింగనాయకర్ విద్యాభివృద్ధి కోసం వేలాది ఎకరాలు దానంగా ఇస్తే తన హయాంలోనే ఆయన వర్థంతి, జయంతిలను అధికారికంగా చేయించేందుకు కౌన్సిల్లో తీర్మానాలు చేయించానన్నారు.మత్స్యకారులు నివశించే ఏటిమొగ ప్రాంతంలో డ్రైఫిష్ మార్కెట్ అభివృద్ధి, మల్లారమ్మగుడి వద్ద పార్కు సుందరీకరణ, ఏటిమొగ వద్ద కనెక్టింగ్ రహదారులు, బోటు ఓనర్ల సంఘ భవన నిర్మాణానికి తోడ్పాటు, గంగమ్మతల్లి ఆయానికి స్థలం కేటాయింపు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశానన్నారు. దుమ్ములపేటను దత్తత తీసుకున్న కొండబాబు ఆ ప్రాంతాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని, తన హయాంలో ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దానన్నారు. ముఖ్యంగా కొండబాబు అధికారంలో ఉన్నప్పుడు వేటకు వెళ్ళిన బోట్లు దగ్థమైతే బాధితులకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయారన్నారు. ఇటీవల బోట్లు దగ్థమైతే లక్షల రూపాయలను సీఎం సహాయనిధి నుంచి మంజూరు చేయించానన్నారు. రేవు కార్మికుల్లో 90 శాతం మంది మత్స్యకారులేనని, కనీసం వీరిని కూడా కొండబాబు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తన హయాంలో మత్స్యకారులకు 9797 ఇళ్ళ స్థలాలు ఇచ్చామన్నారు. మరీ మఖ్యంగా నగర పరిధిలో ఉన్న స్థలాన్ని మత్స్యకారులకు కేటాయించేందుకు ప్రయత్నిస్తే దానిని కూడా కోర్టుకు వెళ్ళి అడ్డుకున్న ఘనత కొండబాబుదేనన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
గంజాయి వ్యాపారంలో వనమాడి కుటుంబం :
కొండబాబు కుటుంబం గంజాయి వ్యాపారం చేస్తోందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు, ఆ మేరకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వీరిని పట్టిస్తానన్నారు. మత్స్యకార ప్రాంతాల్లోని యువతను గంజాయికి బానిసనను చేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని ద్వారంపూడి ఆరోపించారు.