జగనన్న భూరక్ష పథకం ఓ బోగస్ అని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పరిధిలో తన స్వగ్రామమైన ఐనంబాకం గ్రామంలో తన భూమికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకం, సర్వే సిబ్బంది నాటిన రాళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ…జగనన్న భూరక్ష పథకం కింద పట్టాదారు పాసు పుస్తకాలు ముద్రించి, ముఖ్యమంత్రి బొమ్మ వేసి ఇదే మీ పాసు పుస్తకం అని రైతులకు ఇస్తున్నారు. ఈ పాసు పుస్తకం నాలిక గీసుకోడానికి కూడా పనికి రాదు. అధికారులు ఇచ్చిన నియమాల మేరకే… బ్యాంకు రుణం తీసుకునే సందర్భంలో కానీ, భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం, పట్టాదారు పాసుపుస్తకం అధికారికి చూపించనవసరం లేదట. అంటే ఇది బోగస్ పత్రం. దేనికీ పనికి రాదు. నాలుక గీసుకునే దానికి కూడా పనికి రాదు. జగన్ బొమ్మ ముద్రించి కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు ఎంతో విలువైనవి. వీటిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి. వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు పొందవచ్చు. జగన్ ఇచ్చిన పాసు పుస్తకంలో బొమ్మ కనిపిస్తుంది తప్పితే దేనికీ పనికి రాదు. ఈ పుస్తకంతో బ్యాంకులో రుణాలు ఇవ్వరు. హక్కు పత్రం రాదు. హక్కు రాదు. ఊరికే విగ్రహంలా పెట్టుకోవచ్చు. దీంతో పాటు రీ సర్వే చేశారు. ఈ సర్వేతో క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. రైతులకు ఉమ్మడి హక్కు పత్రాలు ఇవ్వడం వలన చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలా చేయడం వలన రైతుల మధ్య వివాదాలు వస్తున్నాయి. అనేక తప్పుల తడకలతో భూరక్ష పథకం కింద పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నారు. ఇందుకోసం జగన్ సర్కారు వేల కోట్లు ఖర్చు చేసి బొమ్మలతో బండలు వేశారు. ఇలానే తెలంగాణలో మునుపటి ముఖ్యమంత్రి చేశారు. అందులో వినియోగదారుల హక్కులు కనబడలేదు. అనుభవదారుల హక్కు కనబడలేదు. ఈ కారణంగా అనుభవించే వారి భూమి భూస్వాముల పాలైంది. తెలంగాణలో కేసీఆర్ కు అదే దెబ్బ తీసింది. ఇలానే ఏపీలో జగన్ ను కూడా భూరక్ష పథకం దెబ్బ తీబోతోంది. ఈ రీ సర్వే వలన రైతుకు ఎలాంటి ఉపయోగం లేదు. బండలు కనిపిస్తాయి. పుస్తకం కనిపిస్తుది. ఈ పుస్తకం, ఈ రాయి ఓ శిలా ఫథకంలా ఉంటాయి. స్మశాన వాటికలా ఉంటుంది తప్ప ఏం ఉపయోగం లేదు. ఈ బండలే రాబోయే కాలంలో జగన్ కు శిలాఫలకంలా మిగిలిపోతుంది. ఈ పథకమే రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఓడించబోతోంది అంటూ నారాయణ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న భూరక్ష పథకం కింద ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే కార్యక్రమం క్షేత్ర స్థాయిలో రైతుల మధ్య చిచ్చు పెడుతోంది. తరతరాలుగా తమ అనుభవంలో ఉన్న భూమి ఇతరుల ఆధీనంలోకి వెళుతోంది. ఇది రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. భూములు సర్వే చేయడానికి రోవర్ వినియోగించాలి. ఈ పరికరంతో సర్వే చేస్తే ఖచ్చితత్వం వస్తుంది. అయితే జగన్ సర్కారు రీ సర్వేకి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ (ఆర్వో ఐ) పరికరం వినియోగిస్తోంది. సర్వేకి ఈ పరికరం వినియోగించడం వలన పొలం విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు వస్తున్నాయి. పొలం గట్లలో సరిహద్దుల సమస్యలు వస్తున్నాయి. ఇవి చిలికి చిలికి గాలివానగా మారి దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ముఖ్యంగా రీ సర్వేకు రైతులు సహకరించడం లేదు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో రీ సర్వేకు సహకరించాల్సిన గ్రామ రెవిన్యూ అధికారులు (వీఆర్వో) తమకు ఏమీ పట్టనట్లు ఉంటున్నారు. ఇక రీ సర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా డిప్యూటీ తహసీల్దారు, మండల సర్వేయరుతో ఓ బృందం ఏర్పాటు చేసింది. సచివాలయ సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో సర్వే చేసే సమయంలో ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత ఈ మండల బృందంపై ఉంది. అయితే వీరు దిష్టి బొమ్మలా ఉంటున్నారు తప్ప… సమస్యల పరిష్కారానికి సహకరించడం లేదు. దీంతో సచివాలయ సర్వేయర్లు ఇబ్బందులు పడాల్సివస్తుంది. ముఖ్యంగా రీ సర్వే చేసిన గ్రామాల్లో ఉమ్మడి భూమికి 1-బి రావడం లేదు. 1-బి లేక పోవడం వలన రైతులు బ్యాంకుల్లో పాసుపుస్తకాలు పెట్టి రుణాలు పొందలేకపోతున్నారు. ఇది చాలా ప్రధాన సమస్య. ఇది ప్రభుత్వానికి తెలిసినా సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు. రైతులకు కూడా భూ సర్వేపై అవగాహన లేక పోవడం ప్రధాన సమస్య. ఇక సచివాలయ సర్వేయర్లకు సర్వే చేయడానికి తగిన సమయం ఇవ్వకుండా పని ఒత్తిడి పెంచడం వలన కొలతల్లో ఖచ్చితత్వం లోపిస్తోందనే విమర్శ బలంగా ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
జగనన్న భూరక్ష పథకం ఓ బోగస్ – కె.నారాయణ
65
previous post