జయచంద్ర రెడ్డి (Jayachandra Reddy) :
తంబళ్లపల్లె నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra babu Naidu) అన్ని రకాల సర్వేలు నిర్వహించి జయచంద్ర రెడ్డి (Jayachandra Reddy) నాయకత్వాన్ని బలపరిచారని తంబళ్లపల్లెలో ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పని చేయాలని అలా కాకుండా కొందరు అసత్య ప్రచారాలు, సమస్యలు సృష్టిస్తే ఖచ్చితంగా వేటు తప్పదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ములకలచెరువు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులతో సమీక్ష సమావేశం జరిగింది. తంబళ్లపల్లి నియోజకవర్గం లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గెలుపు కోసం మండలాల నాయకులు ప్రణాళిక బద్ధంగా ప్రచారం నిర్వహించాలన్నారు. అధినేత చంద్రబాబు ఆదేశాలతో మేనిఫెస్టో లోని సూపర్ సిక్స్ పథకాలతో పాటు వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన అరాచకం, దౌర్జన్యాలు, భూ దోపిడి, మాఫియాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా ప్రతి గడపకు చేరవేయాలి అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మండలాల పరిధిలోని నాయకులు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను కూలంకషంగా విశదీకరిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు ఎలాంటి ఆటంకాలు సృష్టించిన వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో పోలింగ్ బూత్ కమిటీలు కీలకంగా పనిచేయాల్సి ఉంటుందని వారి సేవలను స్థానికంగా నాయకులు సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఎన్నికల ప్రచారంలో మన మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని మారుమూల గ్రామాలలో ప్రచారం ఉదృతం చేయాలని ఉత్తేజపరిచారు. రాబోయేది టీడీపీ, జనసేన, బీజేపీ, ఉమ్మడి ప్రభుత్వమేనని నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రతిరోజు మండల స్థాయి నుండి జరిగిన ప్రచార కార్యక్రమాల వివరాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి వివరాలు అందేలా చూడాలని ఎక్కడ ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎప్పటికప్పుడు తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి జయచంద్ర రెడ్డి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల నాయకులు ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకెళ్లాలని తంబళ్లపల్లెలో విజయకేతనం ఎగురవేసి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కానుక ఇచ్చేంతవరకు ప్రతి ఒక్కరు ఓ సైనికుడి లా పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా జయ చంద్రారెడ్డి మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని రాబోయే రోజుల్లో కీలకంగా పని చేయాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి తెలుగుదేశం పార్టీ విజయ పతాకం ఎగుర వేయడానికి సమిష్టిగా కలిసి రావాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మరియు టీడీపీ అభ్యర్థి జయచంద్ర రెడ్డిని పార్లమెంటు కార్యదర్శి పూస చంద్రమోహన్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన తంబళ్లపల్లె ఇంచార్జ్ పోతుల సాయినాధ్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ అయూబ్, మాజీ ఎంపీటీసీ ఎన్వి రమణారెడ్డి, విశ్వనాథరెడ్డి, ఎస్ విశ్వనాథరెడ్డి, వసంత రెడ్డి ఆరు మండలాల మండల పార్టీ అధ్యక్షులు, కార్యనిర్వాహక సభ్యులు, సీనియర్ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి: నా భర్తను నాకు అప్పగించండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి