నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంశంపై నేడు కేఆర్ఎంబీ కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, ఏపీకి చెందిన అధికారులతో కేఆర్ఎంబీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ అధికారులు ప్రాజెక్ట్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయడానికి వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుపడుతున్నాయి. దీంతో బోర్డు అధికారులు జోక్యం చేసుకొని ఏపీకి నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. నిజానికి ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సారధ్యంలో ఇప్పటికే సమావేశం జరగాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఏపీకి కేటాయించిన నీటి విడుదల విషయంలో హైడ్రామా చోటుచేసుకుంది. అనుమతి మేరకు 5 టీఎంసీల నీటి విడుదల కోసం ఏపీ అధికారులు ప్రయత్నించగా, తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. దీంతో కేఆర్ఎంబీ సభ్యుడు అజయ్ కుమార్, ఈఈలు రఘునాథ్, శివశంకరయ్య ప్రాజెక్టును సందర్శించి ఐదు, ఏడో నంబర్ గేట్లు ఎత్తి ఏపీకి నీటిని విడుదల చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తాత్కాలికంగా తెలంగాణ ఆధీనంలో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఏపీ పోలీసులను వెంటబెట్టుకుని వచ్చిన ఆ రాష్ట్ర ఇంజనీర్లు ప్రాజెక్టుపైకి చొచ్చుకువచ్చి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పరిణామంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రాజెక్టు వద్ద యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వహణను తాత్కాలికంగా కేఆర్ఎంబీకి అప్పగించాలని స్పష్టం చేశారు.
నేడు నాగార్జున సాగర్ పై కేఆర్ఎంబీ కీలక సమావేశం..
84
previous post