సమాజంలో ఉన్నటువంటి ప్రజలు, పౌరుల అవసరాలన్ని తీర్చి దిద్దగలిగే శక్తివంతులు బీసీలు అని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరం లో మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో జిల్లా ఇంచార్జ్, మంత్రి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ నేటి ప్రజా జీవనంలో అన్ని అవసరాల్లోను బలహీన వర్గాల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. బీసీలు సమాజంలో వెనుకబడిన వారు కాదని వెన్నెముక లాంటి వారిని గుర్తించిన ఏకైక నాయకుడు, వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.
పేదవాడు, సంపన్నుడు అనే బేధం లేకుండా దేశ సంపద అందరికీ సమానంగా చేరిన నాడే వారి జీవితానికి భద్రత, భరోసా ఉంటుందన్న లక్ష్యంతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని మంత్రి పేర్కొన్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మమైన 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రేపు సాయంత్రం 6 గంటలకు విజయవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించు కుంటున్నామని మంత్రి తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు జగనన్న ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందారన్నారు. సంక్షోభాలను కూడా అధిగమిస్తూ భరోసా తో కూడి జీవనం సాగిస్తున్నారన్నారు.
పంచభూతాత్మకమైన భూమిలో నీటి మీద ఆధారపడి నీటి నమ్ముకుని జీవిస్తున్న గంగపుత్రులు మత్స్యకార సోదరులని అన్నారు. ధవళేశ్వరం లో మత్స్యకార సోదరులకు ఇప్పటికే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించిందని అన్నారు. వారు ఆర్థికంగా బలపడేందుకు మరిన్ని కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయానికి రూపశిల్పమైన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అయిన రేపటి నుంచే రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ ప్రారంభిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. భారత సంతతి ఆచరించ తగిన గ్రంథం రాజ్యాంగం అటువంటి రాజ్యాంగ విలువలకు కట్టుబడి పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు.తొలుత మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మత్స్యకారులు, స్థానిక నాయకులతో కలసి ధవలేశ్వరం బస్టాండ్ నుంచి జక్కంపూడి సీతారత్నం కళ్యాణ మండపం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.