తిరుపతి (Tirupati)లో లోకల్, నాన్ లోకల్ వార్..
ఆరని శ్రీనివాసులని అంగీకరించలేకపోతున్న తిరుపతి టిడిపి, జనసేన కేడర్…
అభ్యర్థిని మార్చకపోతే ఓటమి తప్పదంటూ సంకేతాలు…
తెలుగుదేశం, జనసేన, బిజెపి అధిష్టానం నిర్ణయం పై… ఆయా పార్టీ నేతల అసంతృప్తి.
చిత్తూరులో వైసీపీలో ఉండి జనసేనలకు వచ్చిన ఆరణి శ్రీనివాస్ తిరుపతి నుంచి పోటీ చేస్తామంటే సహకరించబోమంటున్నా టిడిపి, జనసేన నాయకులు.
భూమన కుటుంబాన్ని ఢీ కొనడం అంత ఈజీ కాదు అంటున్న రాజకీయ పండితులు…
ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయాలని టిడిపి, జనసేన నాయకుల ఆలోచన.
రాష్ట్రమంతటా తెలుగుదేశం, జనసేన అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా స్థానిక పరిస్థితులను అనుసరించి వారి అభిప్రాయాలకూ అణుగుణంగా గెలుపు గురాళ్లకే టికెట్టు ఇవ్వాల్సిన జనసేన, టిడిపి పార్టీలు తిరుపతిలో మాత్రం మొదటిలోనే తప్పటడుగు వేసింది. రాష్ట్రమంతా ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం జనసేన కూటమి విజయం ఖచ్చితంగా సాధిస్తుందని దీనికి తోడు బిజెపి కూడా కలిసి రావడంతో టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థులు గెలవడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అభ్యర్థుల ఎంపిక అనేది పార్టీల అధినేతలకు కత్తి మీద సాము లాంటిదే. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ప్రధానంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి వారికి అనుకూలంగా ఉన్న నేతలను బరిలోకి దించాల్సి ఉంటుంది. ఇందులో ఆర్థిక బలం, అంగ బలం, ప్రజా అభిమానం, పార్టీపై సానుకూలత, స్థానికత అనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయా పార్టీ నేతలు బి ఫామ్ లు ఇస్తారు. అయితే తిరుపతిలో మాత్రం అందుకు రివర్స్ లో అభ్యర్థుల ఎంపిక జరిగిందని తిరుపతి వాసులు అంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో తిరుమల శ్రీవారి పాదాల చెంత విజయం సాధించిన అభ్యర్థి సెంటిమెంట్ గానే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడతారని నమ్మకం కూడా బలంగా ఉంది. తిరుపతి అసెంబ్లీ స్థానం నుండి మహామహులు పోటీకి దిగి విజయం సాధించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించినవారే. అందులో ఎన్టీ రామారావు, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు ఉండడం గమనార్హం. ఇంతటి కీలకమైన స్థానంలో ఇప్పుడు విజయం ఏ పార్టీలకైనా అత్యంత కీలకం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తెలుగుదేశం, బిజెపి, జనసేన కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థి ఎంపిక విషయంలో పూర్తిగా సరైన అంచనాకు రావడంలేదనే విషయం పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. చిత్తూరు అసెంబ్లీ స్థానానికి తనకు టికెట్టు ఇవ్వలేదని ఆవేదనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలి జనసేనలో చేరిన ఆరని శ్రీనివాసులు కు తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని ప్రకటించడం తిరుపతి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించడమే కాకుండా పార్టీ వర్గాలను సైతం ఆవేదనకు గురిచేస్తుంది. నిన్నటి వరకు వైసిపి లో ఎమ్మెల్యేగా ఉన్న ఆరని శ్రీనివాసులను చిత్తూరు నుండి తిరుపతికి తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం పై స్థానికులు ఒప్పుకున్నా టిడిపి జనసేన లోని నాయకులు మాత్రం ససేమిరా అంటున్నారు.
అసలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం లో 2019 లో జరిగిన ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి అత్యంత స్వల్పంగా 700 పైచిలుకు ఓట్లతో గెలిచారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు భూమన అభినయ రెడ్డిని తెరపైకి తెచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా భూమన అభినయ్ తిరుపతి అభివృద్ధిలో తన మార్కును చాటుకున్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా లేని అభివృద్ధిని ఏడాది కాలంలోనే చేసి చూపించారు. మౌలిక వసతులు కల్పిస్తే కచ్చితంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావనతో భూమన అభినయ రెడ్డి తిరుపతిలో కనువిని ఎరుగనిరుగని రీతిలో మాస్టర్ ప్లాన్ లో భాగంగా రోడ్లను అభివృద్ధి చేశారు. రాష్ట్రమంతటా వైసిపి వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పటికీ తిరుపతిలో మాత్రం వైసీపీని, భూమన కుటుంబాన్ని ఓడించడం అంత ఈజీ కాదని రాజకీయ పండితులు అంటున్నారు. తిరుపతిలో దాదాపు నాలుగు లక్షలకు పైగా ఉన్న ఓటర్లు లో 60 శాతం మందికి పైగా బలిజ కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఉండడం కారణంగా ఇక్కడి అభ్యర్థి గెలుపులో వారి ఓట్లే కీలకంగా పనిచేస్తాయి.తెలుగుదేశం పార్టీలో ఆశావహులైన మాజీ టిడిపి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఊకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాస్, నరసింహ యాదవ్ తదితరులు ఎదురు చూశారు. అదేవిధంగా జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ లాంటి నాయకులు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థులుగా పోటీపడ్డారు.
తిరుపతి పరిస్థితులు చంద్రబాబు నాయుడు బాగా తెలిసినప్పటికీ పొత్తులో భాగంగా సీటును జనసేనకు కేటాయించారు. దీంతో ఇంతకాలం తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీగా అవతరించిన నాటి నుండి తిరుపతిలో ఆ జెండా తోనే ఎన్నికల్లో నిలబడిన పరిస్థితులను పక్కనపెట్టి ఇప్పుడు తొలిసారిగా జనసేన జెండా ఎగిరేలా పరిస్థితి చూడాల్సి వచ్చింది. వైసిపి ఎమ్మెల్యే అయిన ఆరని శ్రీనివాసులు చిత్తూరు లో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్కడ గెలవడని వైసీపీ అధిష్టానం ఆరణికి టికెట్టు కేటాయించ లేదు. దీంతో ఆరణి జనసేన కండువా కప్పుకున్నారు. జనసేనలో తీసుకున్న వెంటనే స్థానికేతరుడు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన అభ్యర్థిగా ప్రకటించడం జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన పార్టీ తరఫున అధినేత పవన్ కళ్యాణ్ నిలబడితే కచ్చితంగా విజయాన్ని సాధించ వచ్చు అనే అభిప్రాయం ఉంది.
అలాకాకుండా జనసేనలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు నిలబడినా గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవు. కాదు అంటే తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన లోకి వెళ్లితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకుల భావన. ఒక విధంగా చెప్పాలి అంటే తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ పనిచేస్తోంది. జనసేనకు ఉన్న పార్టీ క్యాడర్ కూడా అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాన్ లోకల్ గా చిత్తూరు లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరని శ్రీనివాసులు తప్పించి నిలబడితే పవన్ కళ్యాణ్ నిలబడాలి.. లేదా ఆర్థికంగా,సామాజికంగ సుగుణమ్మ భలమైన అభ్యర్థి కనుక జనసేనలోకి ఆహ్వానించి ఆమెకే అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే గెలుపుకు డోకా ఉండదని పార్టీ వర్గాలు ఇటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరని శ్రీనివాస్ కు ప్రచారం చేసుకోమన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తిరుపతిలో స్థానిక ఆలయాల దర్శనాలతో పాటు ప్రచారాన్ని కూడా ప్రారంభించేసారు. మరోవైపు టిడిపి జనసేన లోని కొంతమంది నాయకులు కార్యకర్తలు ఆరణి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా గ్రూపులు కట్టారు. మంగళవారం తిరుపతి లో జరిగిన పరిణామాల తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో టిడిపి జనసేన కి సంబంధించి ఏ వ్యక్తినైనా ఇండిపెండెంట్గా అయిన నిలబెట్టి కచ్చితంగా గెలిచి తీరుతామని ఆలోచనలో టిడిపి, జనసేన నాయకులు ఉన్నట్టు సమాచారం.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి