హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో యాత్రికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ధల్లి… సంజౌలి బైపాస్కు దూరంగా ఉండాలని సిమ్లా పోలీసులు ప్రజలకు సూచన జారీ చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
National
నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కేంద్రం చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా.. బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడంలా ఉందంటూ ఎద్దేవా చేశారు. నోట్స్, టెస్ట్ సిరీస్‌లు, చర్చలు, ప్రిపరేషన్ కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎప్పటినుంచో టెలిగ్రామ్ ను ఉపయోగిస్తున్నారని.. దీనిపై నిషేధం విధించడం వల్ల వారు నష్టపోయే ప్రమాదముందని పేర్కొన్నారు. అసలు ఈ ఆలోచన పేపర్ లీక్‌లు అరికట్టడానికి ఎలా ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. నిందితులు టెలిగ్రామ్ కాకుంటే వాట్సప్‌లోనూ పేపర్లు లీక్ చేస్తారని అన్నారు. అలా అని వాట్సప్‌ను కూడా బ్యాన్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు.
ఈ నిషేధం తీరు పరీక్షల్లో మోసాలకు పాల్పడే పేపర్ లీక్ నెట్‌వర్క్‌లను కాకుండా, విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉందని రాహుల్ ఆక్షేపించారు. నీట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయం నుంచి దృష్టి మరల్చడానికే కేంద్రం ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించారు. దేశంలో పదేపదే పేపర్ లీక్‌లకు పాల్పడుతున్న నిందితులపై చర్యలు తీసుకోవడంలో మోదీ యంత్రాంగం విఫలమైందన్నారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే పేపర్ లీక్ మాఫియా నడుస్తోందని.. దానిని కప్పిపుచ్చుకొనేందుకే పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా బలగాలను మోహరించడం, ప్రశ్నపత్రాలను వైమానిక దళం ద్వారా పంపించడం వంటి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం మాట వినకపోతే తమ హక్కులను ఎలా సాధించుకోవాలో యువతకు తెలుసని అన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ సహకార సంస్థల ద్వారా పంట రుణాలు పొందిన రైతుల కోసం అత్యంత ప్రాధాన్యత కలిగిన రుణమాఫీ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 14,43,504 మంది రైతులకు లబ్ది కలిగినట్టయింది. 5,932.23 కోట్ల రూపాయల మేర రుణాల నుండి విముక్తి కలగనుంది. ప్రతీ రైతుకు ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన తాజా మార్గదర్శకాలు కూడా విడుదల అయ్యాయి. ఈ మేరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు
నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం జూన్ 22 వరకు వరకు కొనసాగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు, అనామక టెలిగ్రామ్ ఛానెళ్లు.. అభ్యర్థుల నుంచి ప్రశ్నపత్రాల లీకేజీ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఈ తాత్కాలిక నిషేధ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతించింది NTA.
ఈ మోసాలతో పాటు, పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నపత్రాన్ని అప్లోడ్ చేసి, మెసేజ్‌ను ఎడిట్ చేయడం ద్వారా పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు తప్పుడు స్క్రీన్షాట్లు సృష్టించి పుకార్లు పుట్టిస్తున్నట్లు అధికారులు గమనించారు. ఈ ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, జూన్ 30 వరకు భారత్‌లో ఈ ఫీచర్‌ను కూడా నిలిపివేయాలని కేంద్రం టెలిగ్రామ్ సంస్థను ఆదేశించినట్లు తెలుస్తుంది. సాధారణ వినియోగదారులకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ, పరీక్షల పారదర్శకతను కాపాడటానికి, అభ్యర్థులు తప్పుడు పుకార్ల బారిన పడకుండా ఉండటానికి ఈ నిర్ణయం అనివార్యమైందని స్పష్టం చేశారు.
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తన పుట్టిన రోజున కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. జూన్ 22న ఆయన జన్మదినోత్సవం సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు కొత్త తరహా రేషన్ కార్డులు అందివ్వనున్నారు. ఆహార, పౌరసరఫరా శాఖ అధికారులు ఇప్పటికే 46 వేల కొత్తరేషన్ కార్డులను ప్రింట్ చేశారు. వాటిని పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి సుమారు 2..25 లక్షల మంది కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే తొలిదశలో 46 వేల మందికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. పెరంబదూర్‌లో జరిగే బర్త్ డే కార్యక్రమంలో సీఎం విజయ్ కొత్త రేషన్ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తొలిసారి పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కోసం టీవీకే భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ మరో కీలక మైలురాయిని అధిగమించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ఫ్లైట్-టెస్ట్ నిర్వహించారు. ఈ ప్రయోగం నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తిగా చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా క్షిపణి గమనాన్ని పర్యవేక్షించినట్లు పేర్కొంది. ఈ విజయంతో సుదూర లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించే భారత సామర్థ్యం మరింత పెరిగినట్లయింది. రక్షణ కార్యదర్శి, డీఆర్డీఓ ఛైర్మన్ రాజేష్ కుమార్ సింగ్‌తో పాటు భారత నౌకాదళం, వాయుసేనకు చెందిన ఉన్నతాధికారులు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ బృందాన్ని, పరిశ్రమ భాగస్వాములను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. డీఆర్డీఓ ప్రయోగశాలలు, భారత పరిశ్రమ భాగస్వాములతో కలిసి ఈ క్షిపణిలోని అన్ని ఉపవ్యవస్థలను దేశీయంగానే అభివృద్ధి చేశాయి. బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నోడల్ లేబొరేటరీగా వ్యవహరించింది. ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక ముందడుగు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండు రోజుల క్రితమే డీఆర్డీఓ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ , యాంటీ-షిప్ క్షిపణులను వరుసగా పరీక్షించింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 13వేల 343 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది మే 24న దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. మొత్తం ఒక వెయ్యి పదహారు సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, మెయిన్స్‌కు ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా జూన్ 19 నుంచి 28 మధ్య యూపీఎస్సీ పోర్టల్‌లో లాగిన్ అయి డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే 200 రూపాయల పరీక్ష ఫీజును చెల్లించాలి. అయితే, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ కీలను సివిల్ సర్వీసెస్ 2026 తుది ఫలితాలు వెలువడిన తర్వాతే ప్రకటిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఏవైనా సందేహాలుంటే యూపీఎస్సీ కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని సూచించింది.
పశ్చిమబెంగాల్లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు దహనం అయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వినియోగించిన ఈవీఎంలను కోల్‌కతా అలీపూర్‌లోని ప్రభుత్వ భవనంలో అధికారులు భద్రపరిచారు. ఈవీఎంల దహనంపై ప్రతిపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని… అందుకే ఈవీఎంలను దగ్దం చేశారని ఆరోపిస్తున్నారు.
సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి చుక్కెదురైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మీనాక్షి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఆర్వో నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మీనాక్షి పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. మీనాక్షి నటరాజన్ తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. వాడీవేడీగా వాదనలు జరిగాయి. నామినేషన్‌ను తిరస్కరించిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకున్న ఘటనలు గతంలో ఉన్నాయా అని పిటిషనర్‌ను సుప్రీం ప్రశ్నించింది. అలాంటి తీర్పులు ఉంటే కోర్టు ముందు పెట్టాలని సూచించింది. ఈ తీర్పుతో చాలా మంది ఇక నుంచి కేసులు వేస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. వాదోపదావనల తర్వాత మీనాక్షి పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. అయితే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించింది. అక్కడా న్యాయం జరగకుంటే హైకోర్టుకు వెళ్లవచ్చని పేర్కొంది.
రష్యాతో భారత్ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను ప్రశ్నించే ఐరోపా దేశాలు, తమ విక్రయించిన ఆయుధాలు భారత ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లి భారత్‌పైనే ఉపయోగించబడ్డ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. ఫిన్లాండ్లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.అలాగే, భారత ప్రత్యర్థి దేశాలకు ఐరోపా దేశాలు ఆయుధాలు విక్రయించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, “భారత్ తయారుచేసిన ఆయుధాలతో ఏ ఐరోపా దేశంపైనా దాడులు జరగలేదు. కానీ ఐరోపా దేశాలు విక్రయించిన ఆయుధాలు భారత్‌పై దాడులకు ఉపయోగించబడ్డాయి. ఇది ఇప్పుడే కాదు, చాలా కాలంగా జరుగుతోంది” అని పేర్కొన్నారు.భారత్ ఎప్పుడూ ఐరోపా భద్రతకు ముప్పుగా వ్యవహరించలేదని, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని జైశంకర్ స్పష్టం చేశారు.






Total views : 198770