మాజీ మంత్రి పల్లె రఘునాథ్ (Palle Raghunath) కు టికెట్ నో అన్న అధిష్టానం.
ఆయన కోడలు పల్లె సింధూర రెడ్డి ని అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు.
దశాబ్దాలుగా అదే సామాజిక వర్గానికి టికెట్ ఇస్తుండడంతో పుట్టపర్తి తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం.
ఏకంగా ఉండవల్లి లోని చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన.
ఎమ్మెల్యే టికెట్ పై ఆశ చంపుకోలేకపోతున్న పల్లె.
ప్రచారం మొదటి రోజే సొమ్మసిల పడిపోయిన సింధూర రెడ్డి.
లోలోన మదన పడుతున్న పల్లె రఘునాథ్ రెడ్డి.
ఎన్నో ఏళ్ళు పార్టీకి సేవలందించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కొందరికి పార్టీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంటారు. మరి కొంతమంది టికెట్లు దక్కకపోవడంతో దిక్కారస్వరం వినిపించి ప్రత్యర్థి పార్టీల తీర్థం పుచ్చుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటికీ భిన్నంగా టికెట్ పై ఆశలు పెంచుకున్న తనని కాదని తన కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడంతో విచిత్ర పరిస్థితి నెలకొనడానికి వేదిక అయింది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గం. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ నిరాకరించిన అధిష్టానం.. ఆయన కోడలు పల్లె సింధూర రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీనితో తన రాజకీయ భవిష్యత్తుకు పుల్ స్టాపేనా..? అన్న అనుమానంతో పల్లె దిగులు చెందుతున్నాడట. తనకు టికెట్ రాలేదని బాధపడాలో.. లేక తన కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయాలో తెలియని డోలాయమాన పరిస్థితిలో మాజీ మంత్రి పల్లె ఉన్నారట. దీనికి తోడు ప్రచారం మొదటి రోజే గంటల వ్యవధిలోనే అభ్యర్థి సింధూర రెడ్డి ఎండ వేడిమికి తాళలేక సొమ్మసిల్లి పడిపోయారు. పల్లె రఘునాథ్ రెడ్డి ని కుంగదీసే అంశంగా చెబుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇదొక్కసారి తనకు అవకాశం కల్పించాలని అధిష్టానం వద్ద మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అభ్యర్థించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన వయో భారం కారణంగానే ఆయన కోడలు పల్లె సింధూర రెడ్డికి టికెట్ ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పదవి అంటే ఎవరికి తీపి ఉండదు.. అందుకు పల్లె కూడా అతీతం కాదు. పుట్టపర్తి రాజకీయాలలో తన ప్రాబల్యం కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. తన కోడలు ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ తన ప్రాబల్యం తగ్గుతుందనే పల్లె రఘునాథ్ లోలోన మదన పడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసలే పుట్టపర్తి తెలుగుదేశంలో అసమ్మతి ఎక్కువగా ఉంది. టికెట్టును పల్లె సింధూర రెడ్డికి ప్రకటించగానే ఉండవల్లిలోనే చంద్రబాబు నివాసం ఎదుట పుట్టపర్తి తెలుగు తమ్ముళ్లు ధర్నా సైతం నిర్వహించారు. ఒకే సామాజిక వర్గానికి దశాబ్దాలుగా టికెట్ కేటాయించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో తన కోడలు ఏమాత్రం నెగ్గుకు రాగలదన్న అనుమానం ఆయనలో ఉన్నట్టు సమాచారం. టికెట్ ప్రకటించగానే కొత్త చెరువు మండలంలోని ఆంజనేయస్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం చేపట్టారు.
ఇది చదవండి : పల్నాటి గడ్డపై… గుర్రపు స్వారీ చేసి గెలిచేది ఎవరు…?
భారీగా జన సందోహం మధ్య అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మొదట్లో ఉత్సాహంగానే కనిపించారు. వేలాదిగా తరలివచ్చిన జనాల తాకిడి ఓవైపు ఉండగా, మరోవైపు ఎండ వేడిమికి తాళలేక కొద్దిసేపటి తర్వాత ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. ఉన్నత కుటుంబం కావడంతో ఎప్పుడు ఎండలకి తిరిగిన అనుభవం ఆమెకు లేదు. అలాగే వందలాది మంది మధ్య మసులుకున్న దాఖలాలు లేదు. దీంతో ఒక్కసారిగా డిహైడ్రేట్ అయి సొమ్మసిల్లి పడిపోయారు అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి. దీంతో పల్లె రఘునాథ్ రెడ్డి కలత చెందారు. రానున్న వేసవిలో ప్రచారం కారణంగా గ్రామాలలో పర్యటించాల్సి ఉంటుంది. ఈ వేసవికి సింధూర తట్టుకోగలదా..? తట్టుకొని ప్రచారం చేయగలర.? అన్న అనుమానం ఇప్పుడు పల్లెను పట్టిపీడిస్తున్న ప్రశ్న. ఇటు అసమ్మతిని బుజ్జగించడం.. మరోవైపు ఎలక్షన్ల సమయంలో ప్రజలను హ్యాండిల్ చేయడం కష్టమైన పనిగానే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు . దీనికి తోడు అభ్యర్థి సింధూర ప్రస్తుత వేసవి వాతావరణాన్ని తట్టుకుని ప్రచారం కొనసాగించగలరా అన్న అనుమానాలను తెరమీదికి తెస్తున్నారు. దీంతో పల్లె రఘునాథ్ రెడ్డి కొంత మానసిక ఆవేదనకు గురైతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అసలే టికెట్ తనకి రాకపోవడం తో ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతాననే బాధ ఆయనని పట్టిపీడిస్తుంటే .. ఈ తాజా పరిస్థితి మరింత కృంగదీస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి