రేవంత్ రెడ్డి… తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం ఆయన. తెలుగు రాజకీయాలలో సంచలనాలకు చిరునామా. వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చారు. ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక విశేషం. అధిష్టానం ఆశీస్సులతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం మరో విశేషం. పార్టీని అధిక స్థానాలలో గెలిపించడం అంతకన్నా గొప్ప విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న వారికి గట్టి సమాధానం చెప్పారు రేవంత్. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడిగా సవాళ్లు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. 2021లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి… సుదీర్ఘ కాలంగాపాటు పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ కు ఆ తర్వాత ఉపఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ సమయంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి సీనియర్ల నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. వారిని సమన్వయం చేసుకుంటూనే ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ తనదైన ముద్ర వేశారు. రేవంత్ రెడ్డిది మహబూబ్ నగర్ జిల్లా. ఊరు కొండారెడ్డి పల్లె. తండ్రి నరసింహారెడ్డి. తల్లి రామచంద్రమ్మ. 1969 ఆగస్టు 8న జన్మించారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఆరుగురు సోదరులు, ఒక సోదరి. టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. అనంతరం డిగ్గీ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1992లో ఉస్మానియా అనుబంధంగా ఉన్న ఏవీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్… పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ ఉన్నారు. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ లో చురుకుగా పనిచేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెయింటర్ గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు. అది విజయవంతం కావడంతో… రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న రేవంత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె. టీడీపీలో ఉన్నా.. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచే కొడంగల్ లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో 14,614 ఓట్ల మెజారిటీతో రేవంత్ గెలిచారు. 2017లో రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు చంద్రబాబు. ఓవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతకంతకూ బలహీనపడింది. కీలక నేతలంతా కేసీఆర్ పార్టీలో చేరిపోయారు. ఉన్న వారు పార్టీ బాధ్యతలకు దూరంగా ఉండిపోయారు. దీంతో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని నడిపించడం కత్తిమీద సాములా మారింది. అప్పటికే ఓటుకు నోటు కేసులో కొన్నాళ్లు జైల్లో కూడా గడిపిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీవైపు దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆరోపణలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులతో రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్ 17న ఆయన తెలుగుదేశం సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అక్టోబర్ 30న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వర్గ రాజకీయాలకు పెట్టింది పేరులాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన పట్ల కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ముగ్గురు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల్లో ఒకరిగా ఎంపిక చేసింది. కాంగ్రెస్ లో ప్రస్థానం ప్రారంభించిన రేవంత్… 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగారు. ఆ దఫా ఆయన ఓటమి పాలయ్యారు. రేవంత్ కున్న మాస్ ఫాలోయింగ్ చూసిన కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చింది. నాటి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఆయన 10,919 ఓట్ల తేడాతో గెలుపొందిన రేవంత్… మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అంటూ రేవంత్ ఇచ్చిన పిలుపును తెలంగాణ ఓటర్లు నిజం చేశారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్కు కలిసొచ్చాయి. బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. డీలా పడిపోయింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గజ్వేల్లో గెలిచి కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. మంత్రుల్లో ఎనిమిది మంది విజయం సాధించారు. ఆరుగురు పరాజయాన్ని మూటకట్టుకున్నారు. BRS తనకు పట్టున్న పలు నియోజకవర్గాలను కూడా కోల్పోయింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాత్రం రెండుచోట్ల పోటీ చేసినా.. కామారెడ్డిలో ఓడిపోయినా… కొడంగల్లో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రెండుసార్లు అధికారమిచ్చిన BRS ను మార్చాలనే అభిప్రాయంతోపాటు.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఓటర్లపై ప్రభావం చూపింది. BRSకు చెందిన సీనియర్ నాయకులు ఓటమి పాలయ్యారు. పరాజయమే ఎరుగని నేతలను.. తొలిసారిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ యువ అభ్యర్థులు మట్టి కరిపించారు. BRS కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాలను కాంగ్రెస్ బద్దలు కొట్టింది. గత నాలుగైదు ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని స్థానాలు కూడా ఇప్పుడు చేతికి చిక్కాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీనియర్ నాయకుల్లో అత్యధికులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరింది.
Latest NewsAdilabadHyderabadKarimnagarKhammamMahabubnagarMedakNalgondaPoliticsRangareddyTelanganaWarangal
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..
72
previous post