ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు కోసం పోరాడేందుకు మంచి అవకాశం దొరికిందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. రాజ్యసభలో కేంద్రానికి మెజార్టీ లేదని, అందువలన అధికార పార్టీని అడ్డుకుంటే ఏపికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. శ్రీకాకుళంలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, ముగించిన అధ్యాయమన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎక్కడా చెప్పలేదన్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్రానికి సంకల్పం ఉంటే ప్రత్యేక హోదా వస్తుందని స్పష్టం చేశారు. పాండిచ్చేరిలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని, అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారని తెలిపారు. జల్లికట్టు కోసం తమిళనాడు ప్రజలు ఏ విధంగా ఉద్యమం చేశారో అదేవిధంగా మనం కూడా చేయాలన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సంవత్సరం పాటు, రైతులందరూ కలసికట్టుగా ఉద్యమం చేస్తే కేంద్రం దిగివచ్చి నల్ల చట్టాలను రద్దు చేసిందని గుర్తు చేశారు. ప్రజలు సంఘటితంగా ఉద్యమిస్తేనే స్పెషల్ స్టేటస్ వస్తుందని లక్ష్మినారాయణ అన్నారు.
సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం…
64
previous post