69
పంచారామ క్షేత్రమైన పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పవిత్ర కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీకమాసంలో శివ పూజలు చేస్తే మోక్ష మార్గమని భక్తులు విశేషంగా విశ్వసిస్తారు. అలాగే శివుని ముందు దీపం వెలిగించడం పాప విముక్తి, ఆత్మ మోక్షానికి మార్గమని చెబుతుంటారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్తీక స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి భక్తిశ్రద్దలతో పూజలు చేస్తున్నారు.