రాష్ట్రంపై ‘మిచాంగ్’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని… ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా… ప్రభుత్వం తగు రీతిలో స్పందించలేదని అన్నారు. ధాన్యం కొనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారని… సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని… ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలని అన్నారు. తుఫాన్ బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. మరో వైపు మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో చంద్రబాబు శ్రీశైలం పర్యటనను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆయన శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. అయితే తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత దర్శించుకోవాలని అధినేత నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా వుంచితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ లభించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఈ మధ్యే తిరుమలలో శ్రీవారిని, విజయవాడలో కనకదుర్గమ్మ, సింహాచలంలో అప్పన్నను దర్శించుకున్నారు. త్వరలోనే శ్రీశైలం మల్లన్నతోపాటు కడప దర్గా, మేరీమాత చర్చిలను ఆయన సందర్శించనున్నారు. కాగా ఆలయాల సందర్శనకు వెళ్తున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతాలు పలుకుతున్నాయి. భారీ ర్యాలీలతో అధినేతకు మద్దతుగా నిలుస్తున్నాయి.
తీవ్రంగా మారనున్న మిచాంగ్ తుఫాన్ ప్రభావం…
81
previous post