నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 22వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు 4 గంటలపాటు కొనసాగింది. అనంతరం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మొత్తం 59 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 57 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 2 వాయిదా వేశామన్నారు. శ్రీ స్వామి అమ్మవారి ప్రాతఃకాల సేవలో పాల్గొనే భక్తులకు వెండి శివపార్వతుల ప్రతిమను ఇవ్వాలని నిర్ణయించారు. అలానే క్షేత్ర పరిధిలోకి పులులు రాకుండా శివరాత్రి లోపు ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. క్షేత్ర పరిధిలో ప్రసార వ్యవస్థకు ఎల్ఈడి విద్యుత్ కు 20 లక్షలు కేటాయించామన్నారు. భక్తుల సౌకర్యార్థం స్థానిక బ్యాంకుల ద్వారా మరో మూడు ఏటీఎంల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల సందర్శనకు ఏనుగుల చెరువు వద్ద మల్లమ్మ కన్నీరు వద్ద సుమారు 20 ఎకరాల్లో నందనవనం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అలానే పక్షులకు వన్యమృగ పార్కు ఏర్పాటు చేస్తామని, విద్యుత్ ఉత్పత్తికి హైడ్రాలిక్ మిషన్ కి 40 లక్షలకు కూడా ఆమోదం తెలియజేసారు. ముఖ్యంగా రాబోవు శివరాత్రి, రోజువారి అవసరాల కోసం సీసీటీవీ నిర్వహణకు 34 లక్షల ఆమోదించారు. నంది సర్కిల్ వద్ద రహదారి విస్తరణ, రుద్రపార్క్ వద్ద చైన్ లింక్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల నిత్యాన్నదాన భవనంలో వివిధ మరమ్మత్తులకు 15 లక్షలు ఆమోదించి ఇటీవల అటవీశాఖ నుండి దేవస్థానం భూముల బదలాయింపులో అటవీశాఖ కొన్ని కండిషన్స్ పెట్టగా వాటిని పునఃపరిశీలించాలని లిఖితపూర్వకంగా అటవీశాఖ అధికారులకు తెలుపుతామన్నారు. అలానే దేవస్థానంలో పని చేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చే వేతనం ఇవ్వాలని ట్రస్ట్ బోర్డ్ లో ఆమోదం తెలిపి కమిషనర్ కు పంపుతామని చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు.
22వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం…
83
previous post