అడ్డదారుల్లో అధికార దర్పం ప్రదర్శిస్తున్న వైకాపా నియోజకవర్గ ఇంచార్జ్ ల అరాచకాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి విపరీత పరిణామాలు చూడలేదని, అధికారులు ప్రొటోకాల్ నిబంధనలు పక్కనపెట్టి ఇంచార్జిల పాలేర్లలా మారారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా అనేక నియోజకవర్గాల్లో వైకాపా ఇంచార్జిల కేంద్రంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన నిప్పులు చెరిగారు. వాళ్ళు ఏ హోదా, ఏ అధికారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు? కీలక సమావేశాలకి ఎలా హాజరవుతున్నారు? అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభాలు, చివరకు సంక్షేమ పథకాల పంపిణీలోనూ వైకాపా ఇన్‌ఛార్జ్‌ల హవానే కనిపిస్తుండడానికి సమాధానం కోసం ఎవరిని ప్రశ్నించాలని ప్రత్తిపాటి అన్నారు. చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు. ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసింది కాక, నేనే చంపాను అని చెప్పిన వ్యక్తికి పూల బొకేలు ఇచ్చి, వంగివంగి సెల్యూట్‌లు కొట్టడానికి పోలీసులకు సిగ్గుండాలన్నారు. అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి సభల్లో ముందు వరసల్లో కూర్చోబెట్టి ఏ సందేశం ఇస్తున్నారో చెప్పాలన్నారు. జిల్లాల్లో కలెక్టరేట్లు, మున్సిపల్ కార్యాలయాలు ఇలా ఎక్కడ చూసినా వైకాపా ఇంచార్జిల రాజ్యమే కనిపిస్తోందని ప్రత్తిపాటి ధ్వజమెత్తారు. వైకాపా నేతల తీరులో రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తోన్నా అధికారులు మరీ ఇంతగా ఎందుకు సాగిలపడి వారికి వత్తాసు పలుకుతున్నారని నిలదీశారు. ప్రొటోకాల్ లేని వ్యక్తుల్ని అధికారిక సమావేశాలకు అనుమతించకూడదు, ఎన్నికల తరుణంలో అలాంటి వారిని మరింత దూరం పెట్టాలి, అలాంటిది నిబంధనలకు పాతరేసి వైకాపా ఇంచార్జిలే ప్రభుత్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు దారుణమని ప్రత్తిపాటి అన్నారు. నిన్నటి వరకు ఊరు పేరు లేని వాళ్లంతా ఇవాళ వైకాపా ఇంచార్జిల పేరుతో నేరుగా ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తుంటే అక్కడి అధికార పార్టీ సిట్టింగ్‌లే నోరు వెళ్లబెట్టాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. కలెక్టర్లు కూడా వైకాపా నేతల ముందు చేతులు కట్టుకుని కూర్చునే దుస్థితిని నేను ఎక్కడా చూడలేదని ప్రత్తిపాటి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ఇంచార్జ్ లు అంతా శంకరగిరి మాన్యాలు పట్టుకు పోవడం ఖాయమని, తర్వాత అధికారుల పరిస్థితేంటో ఆలోచించుకోవాలని హెచ్చరించారు.
మితిమీరుతున్నఇన్‌ఛార్జుల అరాచకాలు – ప్రత్తిపాటి
87
previous post