జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉభయగోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు పర్యటన సాగనుంది. పవన్ కల్యాణ్ తన పర్యటన తొలి రోజున భీమవరంలో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో జరిగే సమావేశాలకు హాజరవుతారు. ఈ పర్యటనలో భాగంగా జనసేన పార్టీ ముఖ్యనేతలు, స్థానికంగా ఉండే ప్రముఖులు, ప్రభావశీలురైన వ్యక్తులను పవన్ కల్యాణ్ కలుసుకోనున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలతోనూ జనసేనాని భేటీ కానున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నేతలు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలప్రదం కావడమే లక్ష్యంగా పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా, ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటనలు మూడు దశల్లో సాగనున్నాయి. తొలి దశలో కీలక నేతలు, ప్రభావశీలురు, ప్రముఖులతో సమావేశాలు ఉంటాయి. రెండో దశలో పార్టీ స్థానిక కమిటీ నేతలు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశాలు నిర్వహిస్తారు. తన పర్యటన మూడో దశలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేపడతారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ముగిశాక పవన్ కల్యాణ్ ఇతర ప్రాంతాల్లో పర్యటించేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.