CVR News Special Article :
ఏపీలో పోటీ ఎలా అన్న విషయాన్ని బీజేపీ ఎట్టకేలకు తేల్చింది. చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లుగా పాత ఎన్డీఏ గ్రూపు మళ్లీ పోటీ చేయబోతోంది. తెలుగుదేశం – జనసేన కలిసి నడవాలని చాన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పి అభ్యర్థులను కూడా అనౌన్స్ చేశారు. ఇన్నాళ్లు ఏ విషయం తేల్చకుండా వస్తూ ఉన్న బీజేపీ ఎట్టకేలకు కూటమిలో కలిసేందుకు ఓకే చెప్పింది. పొత్తులపై శనివారం ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ విబేధించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్టీఏ నుంచి బయటకు వచ్చారు. పవన్ కళ్యాణ్ తోనూ దూరం పెరగడం తో టీడీపీ అప్పుడు ఒంటరిగా పోటీ చేసింది. ఓట్ల చీలిక వల్ల నష్టపోయామని గుర్తించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసిపోయారు. కేంద్రం లో బలంగా ఉన్న బీజేపీతో గొడవ మంచిది కాదని గుర్తించి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. గడచిన ఐదేళ్లలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రెండు మూడుసార్లు పార్టీ అధినాయకత్వాన్ని కూడా కలిశారు. కలిసి పోటీ చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన తెలుగుదేశం – జనసేన ఇప్పటికే కలిసి నడుస్తున్నాయి. బీజేపీని కూడా కూటమిలో చేర్చేందుకు పవన్ కల్యాణ్ తన వంతు ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లుగా ఏ విషయం తేల్చకుండా వస్తున్న బీజేపీ ఎట్టకేలకు కూటమిలో చేరేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్టీఏలోకి చేరుతున్న విషయాన్ని బీజేపీ శనివారం అధికారికంగా వెల్లడించనున్నారు అంట.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఎన్డీలోకి తెలుగుదేశం చేరిక విషయాన్ని ప్రకటించిన వెంటనే చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. మార్చి 4 వ తేదీన సీట్ల ప్రకటన చేసేందుకు రంగం సిద్దం చేసారు. ఇప్పటికే జనసేన – టీడీపీ కూటమి 99 సీట్లను అనౌన్స్ చేసేశాయి, బీజేపీ వైపు నుంచి చాలా రోజులు కదలిక లేక పోవడంతో టీడీపీ – జనసేన దూకుడుగా వ్యవహరించాయి. ఒకేసారి టీడీపీ 94, జనసేన 5 సీట్లను ప్రకటించేశాయి. జనసేనకు మొత్తం 24 సీట్లను కేటాయించగా.. ఐదు పేర్లను ప్రకటించారు. అంటే మిగిలిన స్థానాల్లో 19 చోట్ల జనసేన పోటీ చేయనుంది. ఆ పైన మిగిలన వాటిని టీడీపీ – బీజేపే పంచుకోవాలి.
బీజేపీ ప్రధాన లక్ష్యం లోక్ సభ ఎన్నికలు కాబట్టి వారి ఫోకస్ వాటి పైనే ఉంది. పొత్తులపై ప్రకటన ఇంకా రానప్పటికీ సీట్ల సంఖ్య, కేటాయింపు విషయంలో బీజేపీ – టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ 5 లోక్ సభ, 9 అసెంబ్లీ సీట్లను కోరగా, 3 లోక్ సభ, 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సిద్దం అయినట్లు సమాచారం. అరకు, తిరుపతి, హిందూపురం, కర్నూలు, రాజమండ్రి లేదా ఏలూరు పార్లమెంట్ స్థానాలను బీజేపీకి కేటాయించాలని కోరగా వాటిలో 3 పార్లమెంట్ స్థానాలను కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. మరో పక్క అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే.. శ్రీకాకుళం, విశాఖ ఉత్తరం, మాడుగుల, నర్సాపురం, ధర్మవరం, జమ్మలమడుగు, మదనపల్లి, తిరుపతి, పాడేరు, కైకలూరు, నర్సరావుపేట 9 స్థానాలను బీజేపీ కేటాయించాలని కోరగా వాటిలో ఒక 6 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు సూత్ర ప్రాయంగా అంగీకారం కుదిరింది అనేది సంచారం.
మొత్తంగా మార్చ్ మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున వీలైనంత తొందరగా అభ్యర్థులను కూడా ప్రకటించేసి ఎన్నికల పోరాటంలోకి దూకేయాలని మూడు పార్టీలు అనుకుంటున్నాయి. ఎండాకాలం రాకముందే ఎన్నికల రాజకీయ వాతావరణంతో ఏపి లో రాజకీయ వేడి మొదలయింది. రాబోయే 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడతారో వేచి చూడాలి మరి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి