Alluri Sitaramaraju District :
ఏళ్లతరబడి పరిస్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్యలను పరిష్కరిస్తేనే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని, లేకుంటే రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయకుండా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గాలిపాడు గ్రామస్థులు ముక్తకంఠంతో తెలిపారు. తమ గ్రామానికి మంజూరైన రోడ్డును పూర్తి చేయకుండా, గ్రామస్థుల సహనానికి పరీక్ష పెడుతున్న పాలకులు, అధికారులకు ఎన్నికల వేళ తగిన బుద్ధి చెబుతామని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం గతుమ్ పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన గిరిజనులు స్పష్టం చేశారు. 20 కుటుంబాలు నివసిస్తున్న గాలిపాడు గ్రామంలో 120 మంది జనాభా ఉండగా త్రాగడానికి గుక్కెడు మంచినీరు లేదని, మంచినీటి భావి మరమ్మతులకు గురైతే పట్టించుకునే నాధులు కరువయ్యారని, కలుషితమైన నీరుతో అనారోగ్యం బారిన పడుతున్నామని, ఉన్న పాఠశాల ఎప్పుడు కూలిపోతుందో తెలియదని, పాఠశాల భవనం పెచ్చులు ఊడి తమ పిల్లలపై పడుతున్నాయని, ప్రధానంగా రహదారి నిర్మాణం జరగక పోవడంతో తమ గ్రామం మౌలిక సదుపాయాలకు నోచుకోవడం లేదని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య పరంగా అత్యవరమైతే వైద్యం అందని ద్రాక్షగా మారిందని, అధికారులు పాలకులు స్పందించి రహదారి నిర్మాణం చేపట్టి తమ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఎన్నికలు బహిష్కరించనున్నట్లు గాలిపాడు గ్రామస్తులు తెలిపారు.