తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధికారులతో సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. తుఫాను పరిస్థితులపై ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరు –కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుఫాను గమనం ఉందని అధికారులు తెలిపారు. చీరాల, బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రికి వివరించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9500 మంది ఉన్నారని వెల్లడించారు. వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని సీఎం ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు, తిరుపతి సహా తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. తుఫాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ కూడా ప్రారంభం కావాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధలను వాడుకుని రేషన్ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు.
సీఎస్ జి, సీసీఎల్ఏ సెక్రటరీ, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ…
66
previous post