రాముల వారి కళ్యాణానికి సిద్ధమైన కోటి తలంబ్రాల పంట. ఏటా భద్రాద్రి రాముని కళ్యాణానికి అందించే కోటి తలంబ్రాల పంట కోత వినూత్నంగా సాగింది. వానరుల వేషధారణతో రైతులు తలంబ్రాల పంటను కోత కోశారు. తలంబ్రాలకు అవసరమైన పంటను వానర్లే స్వయంగా పండించుకుని కోతలు కోయడం చూపరులను ఆకట్టుకుంటుంది. గోటితో ఒలిచే కోటి తలంబ్రాల పంటకు పంచామృతాభిషేకం జరిగింది. గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో శ్రీరామ భక్తులు వానర వేషధారణలతో రాముని పంట కోత కోశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణం అప్పారావు తన తల్లి పొలంలో 13 ఏళ్లుగా ఈ పంట పండిస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తుల ఆలయంలో పూజించి తీసుకువచ్చిన ధాన్యాన్ని వరి నారువేసి, నాట్లు వేసి, పంట పండిస్తున్నారు. ఈ పంటపై వచ్చిన ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో రామ భక్తులకు పంపించి గోటితో ఒలిచి కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తారు. ఈ తలంబ్రాలను భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాలకు శ్రీరామనవమి పర్వదినం రోజున కోటి తలంబ్రాల కోసం పంపించడమే కాకుండా అయోధ్య రామునికి సైతం పంపించి అక్కడ కళ్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వానర వేషధారణలో పంట కోత కోయడం నిర్వహించారు. వరి కంకులకు పంచామృతాభిషేకం నిర్వహించి, పొలంలో ఉన్న రాముని ఆలయం వద్ద మహిళలతో శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్చాలీసా పారాయణ కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. వానర వేషధారణలతో ఉన్న రైతులు , కూలీలు రాముని పంట కోత కోశారు. ఆధ్యాత్మిక చింతనతో కొనసాగిన కోటి తలంబ్రాల పంట కోత అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ కోటి గోటి తలంబ్రాల కోసం పండించిన ఈ ధాన్యాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 800 కేజీల ధాన్యాన్ని రామభక్తులతో గోటితో ఒలిపించి కోటి తలంబ్రాలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. భద్రాచలం ఒంటిమిట్ట రామాలయాలే కాకుండా అయోధ్య రామలయానికి లోక కళ్యాణం కోసం తీసుకువెళ్లి స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో మహిళలు, రైతులు పాల్గొన్నారు.
కోటి తలంబ్రాల పంట కోత….
86