నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ కు కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. సభలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేలను పరోక్షంగా విమర్శించి, హెచ్చరికలు జారీ చేశారు. నందికొట్కూరులో పక్కా నియోజకవర్గం నాయకులు రాజకీయం చేశారని అదే రాజకీయం మీ నియోజకవర్గంలో నేను చేస్తే మీకు డిపాజిట్లు రావని సిద్ధార్థ రెడ్డి హెచ్చరించారు. గత నాలుగున్నర ఏళ్లలో అధికార పార్టీలో ఉన్న దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని, అటువంటి పరిస్థితులలో కూడా కార్యకర్తలను వీడలేదని అన్నారు. నియోజకవర్గంలో వైసిపి గెలుపుకు ఓట్లు అడిగింది మేము, కేసులు మోపుకుంది మేము, ఇబ్బందులు పడింది మేము అని మా నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం వారి పెత్తనం ఏందని మా ఎమ్మెల్యే వాళ్ల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడడం ఏందనీ, ఎవడో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం ఏందని ప్రశ్నించారు. టిడిపి నాయకులను పక్కన పెట్టుకొని రాజకీయం చేయడం మగతనమని సొంత పార్టీ నేతలను ఘాఢంగా విమర్శించాడు. రాబోయే ఎన్నికలలో అభివృద్ధికి ఓటేయాలంటూ గౌరు వెంకటరెడ్డి, మాండ్ర, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, తోపాటు తాజా ఎమ్మెల్యే ప్రజలను అడుగుతారు, ప్రజలు వీరిని నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ టిడిపి పార్టీలోకి వెళ్ళనున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. వైసీపీ మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని కానీ టిడిపి మేనిఫెస్టోను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. అనంతరం వైసిపి అభ్యర్థి డాక్టర్ సుధీర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలు సుమారు 5000 నుంచి 8000 వరకు పాల్గొన్నారని వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని తెలిపారు.
మీ నియోజకవర్గంలో నేను రాజకీయం చేస్తే…
71
previous post