అంగన్వాడీలు 23 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించని పక్షంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడానికైనా వెనుకాడేది లేదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హెచ్చరించారు. అంగన్వాడీలు కోరుతున్న వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు న్యాయమైన కోరికలని గుర్తు చేశారు. జనవరి 5వ తేదీ లోపు ఉద్యోగాల్లోకి రాకుంటే తొలగిస్తామని సిడిపిఓలు హెచ్చరికలు చేస్తున్నారని.. అంగన్వాడీల తొలగింపు కథ ఎలా ఉన్నా, అధికార వైసిపీ తొలగింపు ఖాయం అయిందని ఎద్దేవా చేశారు. మంత్రి రోజా ఎన్నికలకు ముందు అంగన్వాడీలకే తన మద్దతని, అసెంబ్లీలో తాను చేసిన గొడవ కారణంగానే జీతాలు పెరిగాయని గతంలో డప్పులు కొట్టేదని ఇప్పుడు మంత్రిగా ఉండి సమస్య పరిష్కరించక పోగా సిడిపిఓ ద్వారా అంగన్వాడీలను బెదిరించడానికి పూనుకుంటున్నదని మురళి విమర్శించారు. మహిళా మంత్రిగా ఉంటూ మహిళల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఊసుపోక కబుర్లతో కాలాన్ని గడపటం మానుకుని అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే రాష్ట్రంలోని అన్ని పక్షాల మద్దతుతో రాష్ట్ర బంద్ కు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. తిరుపతి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల, సెక్టార్ల నుంచి అంగన్వాడీలు 3500 మందికి పైగా కలెక్టరేట్ వద్ద బైఠాయింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్లు ఆయాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని నినాదాలు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభించిన బైఠాయింపు కార్యక్రమాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ గేటు వద్ద ప్రభుత్వం పంపిన నోటీసులను అంగన్వాడీలు దగ్ధం చేశారు. అంగన్వాడీలు సాగిస్తున్న పోరాటానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం. జయంతి, పి. సాయి లక్ష్మి లు హాజరై మద్దతు ప్రకటించారు.
మహిళల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా?
77
previous post