ప్రజాపాలన కార్యక్రమంలో అభయ హస్తం సంక్షేమ పథకాల దరఖాస్తులతో పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ప్రజా పాలనలో భాగంగా మంగళవారం ఉదయం వనపర్తి మండలంలోనీ నాచహల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను గ్రామస్థాయిలో గుర్తించి అక్కడే పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. అభయ హస్తం దరఖాస్తులతో పాటు ప్రజల వ్యక్తిగత సమస్యలు లేదా గ్రామ సమస్యలు ఉంటే తెల్ల కాగితం పై రాసి ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో ఇవ్వాలని ప్రజలను కోరారు. దరఖాస్తు లో రాసిన ప్రతి అక్షరం వారి బాధలు, సమస్యలు ఉంటాయని అందువల్ల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ గ్రామ స్థాయిలో పరిష్కారం కాని పక్షంలో తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అభయ హస్తం దరఖాస్తులు ఎలా పూరించాలి అనే విషయం చాలా మందికి తెలియదని అందువల్ల గ్రామంలోని చదువుకున్న యువత ఫారాలు నింపడంలో సహకరించాలని కోరారు. దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జీరాక్స్ పొందుపరచి ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ కిచ్చారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అన్ని గ్రామాలతో పాటు తండాల్లో తిరిగి ప్రజల సమస్యలు గుర్తించడం జరిగిందన్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు నిరుపేద, బడుగు బలహీన అణగారిన ప్రజలకు అందించేందుకు ప్రజా పాలన అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదని, ప్రజా పాలన కార్యక్రమం కింద అధికారులు, ప్రజాప్రతినిధులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ నీ 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. మిగిలిన హామీలను ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. వృద్ధాప్య పింఛన్లు 2000 నుండి 4000 లకు పెంపు, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, కౌలు రైతులకు సంవత్సరానికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం, అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందనీ తెలిపారు. నాచహల్లి గ్రామంలో సి.సి రోడ్లు, డ్రైనేజ్ సిస్టం అస్తవ్యస్తంగా ఉందని వీటిని బాగు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. అంతకుముందు జిల్లా యువజన సర్వీసుల శాఖ జిల్లా అధికారి సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి సందేశాన్ని సభలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుదర్శన్, గ్రామ సర్పంచి మంద శశిరేఖ, ఉప సర్పంచి అబ్దుల్లా, ప్రజలు పాల్గొన్నారు.
ప్రజాపాలన కార్యక్రమం….
159
previous post