Tdp :
ఎన్నికలకు టీడీపీ, జనసేన శ్రేణులను సిద్దం చేసేలా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రంగంలోకి దిగుతున్నారు. మొన్నటి వరకు సీట్ల సర్దుబాటు, పోటీ చేసే అభ్యర్దుల వడపోతతో బిజిబిజీగా ఉన్న వారు.. ఇటీవల సంయుక్తంగా పోటీ చేసే స్థానాలను ప్రకటించారు. ఇక క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నేతలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అయితే తాడేపల్లిగూడెం లో ఈనెల 28వ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. గతంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ ఏర్పాటు చేసిన సభకు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో జనసేన ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు చంద్రబాబు అతిధిగా హాజరవుతున్నారు. ఇరు పార్టీల అధినేతలు ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అన్ని నియోజకవర్గాలలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి పని చేసేలా సంసిద్దం కావాలని పిలుపునివ్వనున్నారు. జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దగ్గర ఉండి మరీ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇరు పార్టీల నుంచి ఈ సభ విజయవంతం చేసే విధంగా ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసి.. అందరూ కలిసి పని చేసే మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ సభకు మహిళలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో వారికి ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మంచి నీరు, మజ్జిగ, ఇతర అల్పాహారాన్ని అందించేలా వాలంటీర్లను నియమించారు. “ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా రెండు పార్టీలూ నిర్వహించబోయే ఈ సభకు ‘తెలుగు జన విజయకేతనం.. జెండా’గా నామకరణం చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయపు జెండా కావాలని, 28వ తేదీన జరగబోయే సభలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇరు పార్టీల అధినేతలు తమ ప్రణాళికను వెల్లడిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జనసేన – తెలుగుదేశం పార్టీ పొత్తును మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారని, వైసీపీ విముక్త రాష్ట్రం కోసం ప్రజలంతా తమకు అండగా ఉంటారని, ఈ ఉమ్మడి సభ రాష్ట్ర రాజకీయాలకు ఒక దిశా నిర్దేశంగా మారబోతుందన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇక ఈ సభకు లక్షల సంఖ్యలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని భావిస్తున్నారు. సువీశాల ప్రాంగణంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకని పకడ్పందీగా బారికేడ్ల ను కడుతున్నారు. ఇక స్టేజి దగ్గర నుంచి వెనుక వరకు గ్యాలరీలను నిర్మించి.. అందులో నిర్దేశించిన వారిని మాత్రమే అనుమతిస్తారు. జన సైనికులు, తెలుగు తమ్ముళ్లు అలాగే వీర మహిళలు, తెలుగు మహిళలు సంయుక్తంగా ఈ సభను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు కూడా పిలుపునిచ్చారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇరు పార్టీల నుంచి నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించడం విశేషం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏర్పడిన పొత్తును బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సంక్షేమం అభివృద్ధి అనే ఉమ్మడి పార్టీల అజెండాను ప్రజలకు అర్థమయ్యేలా ఈ సభలో వివరిస్తామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.
జనసేన, టీడీపీ ఉమ్మడి గా జెండా పేరుతో నిర్వహించే ఈ సభ ద్వారా తమ అజెండాను ప్రజలకు వివరించడంతో పాటు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు, జగన్ చేసిన మోసాలు, మాయలను కూడా చంద్రబాబు, పవన్ లు వివరించనున్నారు. ఇక సిద్దం సభల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాుతున్న జగన్ వ్యాఖ్యలకు కూడా తమదైన శైలిలో ఈ జెండా సభ ద్వారా సరైన బదులు చెబుతారని టీడీపీ, జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు.