డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న నియోజకవర్గం రామచంద్రపురం. గతంలో ఈ నియోజకవర్గానికి రెండు వర్గాలు ప్రాతినిధ్యం వహించేవి. ఇప్పుడు సీను మారింది. ఎవరికి వారే యమునా తీరేగా మారిపోయారు. గతంలో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రత్యర్థులుగా ఉండి పోటీపడేవారు. ఒకసారి తోట నెగ్గితే మరోసారి బోసు నెగ్గె వారు. వైసిపి ఏర్పడ్డ అనంతరం కూడా వీరిద్దరి మధ్య వివాదాలు, పోటీలు జరిగాయి. అనంతర పరిణామాల్లో అనూహ్యంగా తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. దీంతో బద్ధ శత్రువులైన బోస్, త్రిమూర్తులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ ఇద్దరు ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. త్రిమూర్తులు టిడిపిలో ఉన్నప్పుడు బోసు భార్యపై ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నట్లు కేసు పెట్టారు. ఎస్ ఎస్ టి కేసులు కూడా బోస్ కుటుంభం పై పెట్టించారు. అదే విధంగా త్రిమూర్తులు తన పార్టీలో చేరినప్పటికీ ఆయన తనకు ప్రత్యర్థి అని బోసు బహిరంగంగా వాదించారు. వీరిద్దరినీ కాదని వైసిపి అధినేత జగన్ రామచంద్రపురం టికెట్ 2019 ఎన్నికల్లో కోనసీమకు చెందిన చెల్లుబోయిన వేణుకు ఇచ్చారు. ఆయన విజయం సాధించారు. మంత్రి అయ్యారు. దీంతో మంత్రి వేణు అటు బోస్, ఇటు త్రిమూర్తులకు చెక్ పెట్టారు. తన పవర్ పెంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో బోసు కుమారుడు రామచంద్రపురం టికెట్ తనదేనంటూ వైసీపీలో ప్రత్యేక కుంపటి పెట్టారు. దీనితో వేణు, బోసు మధ్య ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొక ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. తోట త్రిమూర్తులు టిడిపిని వదిలేసిన తర్వాత చాలాకాలం ఆ పార్టీకి ఇంచార్జి లేరు. దీంతో కోనసీమ జిల్లాకి చెందిన శాసనమండలి మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను తీసుకొచ్చి ఇంచార్జిగా నియమించారు. కొంతకాలం ఆయన అసమ్మతి లేకుండా నెట్టుకు వచ్చారు. ప్రస్తుతం టిడిపి ఇన్చార్జిగా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం వై సి పి కి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి వేణు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. పైగా వీరు ఇరువురు మంచి స్నేహితులు. వీరు ఇరువురు కాంగ్రెస్ లో కలిసి పనిచేసినప్పుడు కాంట్రాక్ట్ లు కూడా చేశారు. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగేవి. ఈ నేపథ్యంలో రెడ్డి సుబ్రమణ్యంకు టిడిపి టికెట్ ఇస్తే తాము పని చేయమంటూ శెట్టిబలిజ సామాజిక వర్గం కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చింది. మరోపక్క జనసేన ఈ సీటు పై కన్నేసింది. ప్రస్తుతం రామచంద్రపురం ఇన్చార్జిగా ఉన్న పోలిశెట్టి చంద్రశేఖర్ కు పార్టీలోనూ ప్రజల్లోనూ పెద్దగా ఆదరణ లేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యాపారవేత్త చిక్కాల దొరబాబును జనసేనలోకి తీసుకువచ్చారు. రామచంద్రపురాన్ని పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. శెట్టిబలిజ సామాజి వర్గానికి టికెట్ ఇస్తే ముమ్మిడివరానికి చెందిన జనసేన నేత పితాని బాలకృష్ణ కాపు సామాజిక వర్గానికి ఇస్తే కొత్తగా చేరిన చిక్కాల దొరబాబుకు టిక్కెట్టు ఖరారు అని చెప్తున్నారు. అయితే పితాని వద్ద ఆర్థిక బలం లేదు. ఈ రెండు దొరబాబు వద్ద ఉన్నాయి. దీంతో రెడ్డి సుబ్రహ్మణ్యానికి, ఆయన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టేందుకు ఈ టిక్కెట్టు జనసేనకు వదిలేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అదే జరిగితే దొరబాబు జనసేన తరపు అభ్యర్థి అవుతారు. బోస్ లేదా ఆయన తనయుడు వైసిపి నుంచి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి వేణును రాజమండ్రి ఎంపీ లేదా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా పంపిస్తారని నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బోస్ లేదా ఆయన తనయుడును బలంగా ఢీకొనే సత్తా జనసేనకు దక్కుతుంది. మరోపక్క రెండు పార్టీల్లో ఉంటూ స్నేహితులుగా లాలూచీ రాజకీయాలు చేస్తున్న రెడ్డి సుబ్రహ్మణ్యం, వేణులకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై చర్చలు జరుగుతున్నాయి.
ఏ సీటు ఎవరికో ?
71
previous post