జగన్ మోహన్ రెడ్డి మాటలమాత్రం కోటదాటుతున్నాయి. చేతలు మాత్రం గడప దాటడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఘంటసాల మండలం పూషడంలో మొలకెత్తిన వరి పంటను బుద్ధప్రసాద్, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు పరిశీలించి రైతుల ఆవేదన విన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు అపార నష్టం కలిగిందని, ఈ ప్రభుత్వం బీమనది ఛానల్ మురుగు డ్రైనేజీలో తూటికాడ, గుర్రపుడెక్క సకాలంలో తొలగించలేదన్నారు. ఫలితంగా ఈ గ్రామంలో 600 ఎకరాల్లో వరి పంట దారుణంగా మొలకలు వచ్చి పంట దేనికి పనికిరాకుండా పోయిందన్నారు. బీమనది డ్రైనేజీకి రూ.12లక్షలు నిధులు కేటాయించినా పనులు జరగలేదన్నారు. తుఫాన్ ముందు సకాలంలో స్పందించి ముంపు నివారణకు చర్యలు తీసుకుంటే అపార నష్టం తగ్గేదన్నారు. ఈ ప్రాంత రైతులకు కలిగిన నష్టానికి ప్రకృతి కారణం కాదని, పాలకుల నిర్లక్ష్యమే ఈ నష్టానికి కారణమన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నియోజకవర్గంలో ఒకట్రేండు డ్రైనేజీల దగ్గర ఫోటోలు దిగి మొత్తం పరిష్కారం చేసినట్లు ప్రచారం చేసుకున్నారని, కాని ఆయనకు పూషడం గ్రామ రైతుల సమస్యలు ఎమ్మెల్యేకు పట్టవా అని ప్రశ్నించారు. డ్రైనేజీ శాఖ అధికారులు ఎమ్మెల్యే చెప్పిన పనులే చేస్తారా? ఎక్కడ డ్రైనేజీ సమస్య ఉందో గుర్తించి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అని ప్రశ్నించారు. డ్రైనేజీ పనులు తీసుకున్న కాంట్రాక్టరుతో పనులు చేయించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అత్యధిక నష్టం కలిగిందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి రైతులను నట్టింట ముంచేశారన్నారు. తక్షణమే సీఎం జగన్ రైతులకు ఏ సహాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు పంటల బీమా ఈ ఏడాది రైతులకు వర్తిస్తుందా లేదా ప్రకటించాలని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు బీమా పరిహారం దక్కిన దాఖలాలు లేవన్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్ ఇప్పటివరకు మిచౌంగ్ పంట నష్టం పరిశీలించలేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ పంట నష్టం పరిశీలించాలని, ఈ పూషడం గ్రామ రైతులను పరామర్శించి, ప్రభుత్వ సహాయంపై స్పష్టత ఇచ్చి ఆదుకుంటామనే భరోసా ఇవ్వాలని కోరారు. తక్షణమే రైతులకు తదుపరి పంటకు ఇన్ పుట్స్ మొత్తం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది ఎకరాలు సాగు చేసిన కౌలు రైతు గల్లా వెంకటేశ్వరరావు, 16 ఎకరాలు సాగు చేసిన పీ.సాంబశివరావు, ఏడెకరాలు సాగు చేసిన అంకం నాంచారయ్య తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంట పూర్తిగా నాశనం అయిపోయిందని కోత కోసినా ప్రయోజనం లేదన్నారు. వరి పంట మొత్తం దున్నేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జనసేన నాయకులు, జనసేన సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
పంట నష్టం.. పాలకుల నిర్లక్ష్యమే..
71
previous post