శ్రీశైలంలో మహాకుంభాభిషేకం వివాదం రాజకీయ టర్న్ తీసుకుంది. పీఠాధిపతులు నిర్ణయించిన ముహూర్తానికి కాకుండా రాజకీయ నాయకుల ఒత్తిడితో ముందే జరిపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నట్లు, ఇటువంటి పరిణామాలు దేవాలయానికి అరిష్టం అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆలయ శాస్త్రం ప్రకారం కార్యక్రమాలు జరగాలని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకునేది లేదని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. శ్రీశైలంలో ప్రతీ 12 ఏళ్లకు ఓసారి మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. గతేడాది ఆలయ ఈవో ఆధ్వర్యంలో సుమారు రూ.3 కోట్లు ఖర్చు చేసి ఏర్పాట్లు చేశారు. శివాజీ గోపురంతో పాటు ప్రధానాలయాలు, ఉపాలయాలకు పరంజాలు సిద్ధం చేశారు. రంగులతో అలంకారాలు, విద్యుద్దీపాల ఏర్పాట్లు చేపట్టారు. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ముహూర్తాలు ఖరారు చేశారు. ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఇక ప్రారంభమే తరువాయి అన్న క్షణంలో ముహూర్తం నిర్ణయించే విషయంలో పీఠాధిపతులకు ప్రాధాన్యం ఇవ్వలేదని వివాదం మొదలైంది. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. ఉత్తరాయణంలో చేయాల్సిన కార్యాన్ని దక్షిణాయనంలో చేస్తామని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ప్రకటించి అగ్నికి ఆజ్యం పోశారు.
కోర్టుకు చేరిన మహా కుంభాభిషేకం పంచాయితీ శ్రీశైలంలో మహాకుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల నిర్వహణను వాయిదా వేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్ చైర్మన్ సంగాల సాగర్ ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గతేడాది మే నెలలో విచారణ జరిపిన ధర్మాసనం ముహూర్తం తిరిగి ఖరారు చేయాలని దేవాదాయశాఖను, శ్రీశైలం దేవస్థానం ఈవోను ఆదేశించింది. అందుకోసం సంప్రదింపుల ప్రక్రియను గరిష్ఠంగా ఆరు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయితే తాజాగా దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ముహూర్తం నిర్ణయించేందుకు దేవస్థానం ఏడు నెలల సమయం తీసుకోవడంపై దేవదాయ శాఖకు చివాట్లు పెట్టింది. దీంతో ఈ నెల 16 నుంచి శ్రీశైలం దేవస్థానంలో వివిధ కార్యక్రమాలు ప్రారంభించి 21న మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని దేవాదాయశాఖ న్యాయవాది మరియు దేవాదాయ కమిషనర్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. కుంభాభిషేకం నిర్వహణకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను కోర్టుకి అందజేశారు. ఈ వివరాలు నమోదు చేసిన న్యాయస్థానం అపిల్ పై విచారణ మూసివేసింది.
మంత్రి నిర్ణయించిన ముహూర్తానికి జరపడం ఏంటి కారణాగమం ప్రకారం మాఘ మాసం ప్రతిష్ఠలకు పనికిరాదు. అనాదిగా శ్రీశైల దేవస్థానంలో సనాతన ధర్మం సాంప్రదాయ పద్దతులను అనుసరిస్తూ శైవాగమం ప్రకారం కుంబాభిషేకం విషయమై శృంగేరి పీఠాధిపతులను మరియు పుష్పగిరి పీఠాధిపతుల నుంచి అలాగే కంచి పీఠాధపతులను సంప్రదించి వారు నిర్ణయించిన ముహూర్తానికే కార్యక్రమం జరుపుతారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా పీఠాధిపతులు నిర్ణయించిన ముహూర్తానికి కాకుండా కార్యక్రమాలను జరుపుతున్నారు. ఈనెల 16 నుంచి నిర్వహించాలని దేవాదాయ శాఖ దేవస్థానం వారిని ఆదేశించారు. ఈ ముహూర్తంలో జరపడం ప్రామాణికం కాదని శాస్త్ర సమ్మతం కాదని ఆగమ శాస్త్ర విరుద్ధమని పీఠాధిపతులు నిర్ణయించిన ముహూర్తాన్ని కాదని చేయుట శ్రేయస్కరం కాదని హిందూ సంఘాల వారు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. లోకక్షేమం కాదు. కేవలం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నిర్ణయించిన ముహూర్తానికి కార్యక్రమం జరపడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు పండితులు, పీఠాధిపతులు, స్థానిక సిబ్బంది ఇంత మందికి ఇష్టం లేకుండా పీఠాధిపతుల యొక్క సమక్షంలో జరుగకుండా కార్యక్రమం చేయటం అనేది లోక కళ్యాణం కాకపోగా దేశారిష్టమని అంటున్నారు. కావున ప్రస్తుతం కుంభాభిషేకం నిలిపివేసి పీఠాధిపతులు నిర్ణయించిన ముహూర్తానికి జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.