టిల్లు పాత్ర మన అందరి జీవితాల్లో ఒక భాగమైంది: ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)సక్సెస్ మీట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)
చిత్ర బృందం పడిన కష్టమే, ‘టిల్లు స్క్వేర్'(Tillu Square) ఇంతటి విజయం సాధించడానికి కారణం: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు'(DJ Tillu) చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్'(Tillu Square). స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాలతో మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టిల్లు స్క్వేర్'(Tillu Square) సినిమా..
థియేటర్లలో నవ్వులు పూయిస్తూ కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి రూ.150 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం సోమవారం సాయంత్రం విజయోత్సవ సభ నిర్వహించింది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత చినబాబు(ఎస్. రాధాకృష్ణ), మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో పాటు పలువు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) మాట్లాడుతూ..
“అందరికీ నమస్కారం. మిమ్మల్ని(అభిమానులను) చూసి, మాట్లాడి చాలా రోజులైంది. ఇక్కడికి విచ్చేసిన అభిమాన సోదరులకు, పాత్రికేయ మిత్రులకు నా నమస్కారాలు. సిద్ధు నటించిన చాలా సినిమాలు చూశాను. కానీ అతనిని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. పాండమిక్ తర్వాతే మొదటిసారి సిద్ధుని కలవడం జరిగింది. సినిమా అంటే పిచ్చి ఉండే టెక్నీషియన్లు పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో సిద్ధు మొదటి వరుసలో ఉంటాడు.
తనకి సినిమా తప్ప వేరే ఏమీ తెలీదు. డీజే టిల్లు అనే పాత్రని చూసి అతను నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడని మీకు అనుకోవచ్చు. కానీ సిద్ధు అలా కాదు. ఎంతసేపూ తన సినిమా, తను చేస్తున్న పాత్ర, తను రాస్తున్న కథ, ఈ కథకి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన ఉంటుంది. చాలా తక్కువమంది ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ లో ఈ తపనను చూస్తాం మనం.
డీజే టిల్లుతో సిద్ధు కేవలం విజయాన్ని అందుకోవడమే కాకుండా.. మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక పాత్రను ఇచ్చాడు. చాలాసార్లు అనుకునేవాడిని. చిన్నప్పుడు కార్టూన్స్ బాగా చూసేవాడిని. ఇలాంటి క్యారెక్టర్స్ సినిమాల ద్వారా మన లైఫ్ లో మిగిలిపోతే బాగుంటుందని కోరుకునే వాడిని. ఈరోజు టిల్లు.. మన ఇంట్లో, మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు. హాట్సాఫ్ సిద్దు జొన్నలగడ్డ.. మన ఇంట్లో ఉండిపోయి మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసినందుకు. నవ్వించడం అనేది ఒక వరం నవ్వకపోవడం ఒక శాపం. నేను నవ్వడం మొదలుపెడితే, దాన్ని ఆపుకోవడం చాలా కష్టం.
నేను అదుర్స్ సినిమా చేస్తున్నప్పుడు వినాయక్ అన్న చాలా కష్టపడేవాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారిని.. ఆయన డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనను చూస్తేనే నాకు నవ్వు వచ్చేసేది. అరవింద సమేత షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇదే త్రివిక్రమ్ గారు కూడా ఫేస్ చేశారు. అలాంటిది నేనింకా నవ్వలేను బాబోయ్ అనే అంతలా నవ్వించాడు సిద్దు ఈ సినిమాతో. నన్నే కాదు చాలామందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్దుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు ఇంకా చాలా అద్భుతమైన క్యారెక్టర్ లని క్రియేట్ చేయాలి. మనందరికీ అందించాలని, భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను.
దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ గురించి చెప్పను. కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఎక్కువ శాతం ఉంటుంది. కల కనడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని, ఆ కలని సార్ధకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి. కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి.. ఇక్కడ మీరు, ఐ యాం టెల్లింగ్ దట్(త్రివిక్రమ్ తో సరదాగా నవ్వుతూ). త్రివిక్రమ్ గారిని చూసి చాలా రోజులైంది. ఆయనను చూస్తుంటే అరవింద సమేత రోజులు గుర్తుకొస్తున్నాయి. మనిషికి కల కనడానికి ధైర్యం ఉండాలి, ఆ కలను నిజం చేసుకోవడానికి క్రమశిక్షణ అంటే భయం ఉండాలి.
టిల్లు (Tillu Square)చిత్ర బృందం అంత భయపెడుతూ భక్తి శ్రద్ధలతో ప్రేక్షకులు మెచ్చే సినిమాని అందించాలని కష్టపడ్డారు కాబట్టి.. అంతటి ఘన విజయం సాధించింది. కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. కష్టానికి కొలమానం లేదు. కష్టాన్ని ఇలాగే నమ్ముకో.. మరింత ఉన్నత స్థాయికి వెళ్తావు సిద్ధు. నేను సిద్ధుకి, విశ్వక్ కి చాలాసార్లు చెప్పాను.
నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది. భవిష్యత్ లో మీ ఇద్దరూ కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతారు. ఇండస్ట్రీకి మీ ఇద్దరూ ఎంతో ఉపయోగపడతారని చాలాసార్లు వాళ్లకి చెప్పాను. ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే.. చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఇండస్ట్రీకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి. ఒక బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ రూపొందించడం అంత తేలికైన విషయం కాదు. సీక్వెల్ ని అద్భుతంగా తెరకెక్కించిన మల్లిక్ రామ్ గారికి హ్యాట్సాఫ్.
అలాగే ఈ చిత్రానికి పని చేసిన అందరికీ కంగ్రాట్స్. కాసర్ల శ్యామ్ గారు రాసే పాటలంటే మాకు ఇష్టం. ఆయన రాసే పదాల నుంచి మట్టి వాసన వస్తుంది. అలాగే నేహా గారు, అనుపమ గారు అద్భుతంగా నటించారు. వారిద్దరూ లేకపోతే ఈరోజు ఈ చిత్రం ఇంత విజయం సాధించేది కాదు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. వంశీ నిర్మాతగా ఇంకా ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను. దేవర సినిమా విడుదల లేట్ అయినా మీరు అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా అందించడానికి ప్రయత్నిస్తాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.” అన్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Director Trivikram) మాట్లాడుతూ..
“అందరికీ నమస్కారం. ముందుగా 100 కోట్ల క్లబ్ లో చేరిన సిద్ధుకి కంగ్రాట్స్. ఈ సినిమా టిల్లు స్క్వేర్(Tillu Square) మాత్రమే కాదు రాధిక స్క్వేర్ కూడా. నాలుగు సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇంట్లో నాకు టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి నేను సిద్ధుని చూస్తున్నాను. దీని కోసం అతను పడిన కష్టం కానీ, డీజే టిల్లు డైరెక్ట్ చేసిన విమల్ కానీ, టిల్లు స్క్వేర్(Tillu Square) డైరెక్ట్ చేసిన మల్లిక్ కానీ.. వాళ్లు మొత్తం టిల్లు తప్ప ఇంకా ఏమీ పని లేనట్టుగా పనిచేశారు.
అందుకే ఇంత పెద్ద సక్సెస్ కనిపిస్తోంది. వంశీ, చినబాబు గారు సిద్ధూని, ఆ టీంని నమ్మారు. అందుకే డీజే టిల్లు కంటే టిల్లు స్క్వేర్(Tillu Square) పెద్ద హిట్ అయింది. వచ్చే సంవత్సరం అంటే రేపటి నుంచి దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను. ఈ 100 పక్కన ఇంకో సున్నా పెట్టి.. ఆయన దేవర మొదలు పెట్టాలని మీ అందరి తరపున మనందరి తరపున, ఎన్టీఆర్ కంటే కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. ఈ టీం అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.” అన్నారు.
కథానాయకుడు, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ..
“నేను ఈ వేడుకకు రావడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ అన్నను చూడొచ్చని. అన్నను చూస్తే నాకు మాటలు కూడా రావు. లవ్ యూ ఎన్టీఆర్ అన్న. చెప్పి కొట్టడంలో కిక్ ఉంటుంది. సిద్ధు చెప్పి మరీ ఈ విజయం సాధించాడు. ఈ సినిమాని సిద్ధు నమ్మాడో నాకు తెలుసు. ఎప్పుడూ ఈ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వేరే సినిమాలు కూడా చేయకుండా ఈ చిత్రం కోసం ఎక్కువ సమయం కేటాయించాడు. ఒక సినిమాని అంత టైం కేటాయించడం నిజంగా గ్రేట్. టిల్లు పాత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది. వంశీ గారికి, చినబాబు గారికి కంగ్రాట్స్. ఇంతటి విజయాన్ని సాధించిన చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు.” అన్నారు.
చిత్ర కథానాయకుడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) మాట్లాడుతూ..
“ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన మా చిత్ర బృందం మొత్తానికి, అలాగే ఈ సినిమాని ఆదరించి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతఙ్ఞతలు. ఇద్దరి నేను మాట్లాడాలి. ముందుగా త్రివిక్రమ్ గారు. డీజే టిల్లు సినిమాలో త్రివిక్రమ్ గారి ప్రమేయం ఎంత అని చాలామంది నన్ను అడుగుతుంటారు. ఒక స్టూడెంట్ జీవితంలో టీచర్ ప్రమేయం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సినిమా గురించి, జీవితం గురించి ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. త్రివిక్రమ్ గారిని కలవకముందు వేరే మనిషి, కలిశాక వేరే మనిషిని. జీవితంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకున్నాను.
అలాగే ఇంత బిజీలో ఉండి కూడా, అడిగిన వెంటనే మాకు టైం ఇచ్చి, ఈ వేడుకకు విచ్చేసిన ఎన్టీఆర్ గారికి హృదయపూర్వక కృతఙ్ఞతలు. టిల్లు సినిమా చేసిన తర్వాత నీకేమైనా అవార్డులు వచ్చాయా అని చాలామంది అడుగుతూ ఉండేవారు. అప్పుడు అందరికీ తారక్ అన్న నా గురించి మాట్లాడిన వీడియో చూపించేవాడిని. నేను చెప్పిన డైలాగ్ తారక్ అన్న నోటి నుంచి రావడం కంటే పెద్ద అవార్డు ఇంకోటి ఉండదు. త్రివిక్రమ్ చెప్పినట్టుగా.. నాకు, విశ్వక్ సేన్ సహా ఎందరో యువ నటులకి ఎన్టీఆర్ గారు నిజంగానే టార్చ్ బేరర్. ఇటీవల కలిసినప్పుడు చిన్న సినిమా గురించి గంట మాట్లాడారు. అది ఆయన గొప్పతనం. అలాగే మాకు దేవర పాటలు కూడా వినిపించారు. దేవర విడుదల సమయంలో తారక్ అన్నని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అప్పుడు మీతో చాలా విషయాలు పంచుకుంటాను. అలాగే ఈ ఈవెంట్ కి వచ్చిన మా గురించి ఇంత బాగా మాట్లాడిన విశ్వక్ సేన్ కి థాంక్స్. టిల్లు క్యూబ్ తో మిమ్మల్ని మరింత అలరిస్తాను.” అన్నారు.
చిత్ర దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ..
“తొమ్మిది రోజుల్లో ఈ సినిమా 100 కోట్లు వసూలు చేయడం చాలా సంతోషంగా ఉంది. రెండేళ్ల మా శ్రమకు ఇంత మంచి స్పందనను ఇచ్చి, థియేటర్లు హౌస్ ఫుల్ చేసి.. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. రెండేళ్లుగా నా వెన్నంటి ఉండి నడిపించిన సిద్ధు రుణపడి ఉంటాను. ఈ సినిమా విజయం వెనుక అనుపమ పరమేశ్వరన్, నేహా శెట్టి, రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో ఇలా అందరి సమిష్టి కృషి ఉంది. ఈ సినిమాలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎన్టీఆర్ గారు చాలా ఆనందంగా ఉంది.” అన్నారు.
చిత్ర కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..
“మా సినిమాని ఆదరించి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్(Jr NTR) గారికి, త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు.” అన్నారు.
కథానాయిక నేహా శెట్టి మాట్లాడుతూ..
“రాధికగా నాకు ఇంత ప్రేమ ఇచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. డీజే టిల్లు విడుదలైనప్పుడు నా పాత్రకు ఎంత ఆదరణ లభించిందో.. ఇప్పుడు టిల్లు స్క్వేర్(Tillu Square) కి కూడా అదే స్థాయి ఆదరణ లభించింది. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నాకు కన్నీళ్లు వస్తున్నాయి. నాకు రాధిక పాత్రను ఇచ్చిన సిద్ధు, దర్శకుడు విమల్ కి, నిర్మాత నాగవంశీ గారికి ధన్యవాదాలు. మీ వల్లే నేను ఇంతమంది ప్రేక్షకుల ప్రేమను పొందగలిగాను. ఎన్టీఆర్ గారు ఈ ఈవెంట్ కి రావడం సంతోషంగా ఉంది. టిల్లు స్క్వేర్(Tillu Square) లో నన్ను భాగం చేసినందుకు దర్శకుడు మల్లిక్ గారికి థాంక్స్. ఇంతటి విజయాన్ని సాధించిన చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.” అన్నారు.
రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ..
“సిద్ధు గారు వంద కోట్లు కొడతానికి చెప్పి కొట్టారు. ఇందులో నన్ను కూడా భాగం చేసినందుకు ధన్యవాదాలు.” అన్నారు.
రచయిత, నటుడు రవి ఆంథోనీ మాట్లాడుతూ..
“ఇంత పెద్ద సినిమాకు నాకు రాసే అవకాశం ఇచ్చిన సిద్ధుకి జీవితాంతం రుణపడి ఉంటాను. నిర్మాతలు వంశీ గారు, చినబాబు, దర్శకుడు మల్లిక్ రామ్ గారు అందరికీ నా కృతజ్ఞతలు.” అన్నారు.
ఈ వేడుక అభిమానుల కోలాహలం మధ్య ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేతుల మీదుగా చిత్ర బృందానికి జ్ఞాపికలు అందించారు. నటులు ప్రిన్స్, ప్రణీత్, దర్శకుడు విమల్ కృష్ణ, సంగీత దర్శకులు భీమ్స్ సిసిరోలియో, అచ్చు రాజమణి, ఎడిటర్ నవీన్ నూలి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి