నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్స్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఎన్నికల ముందు గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్ వర్కర్లకు న్యాయం చేస్తానని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్విగ్గి, జొమాటో, ఆటో డ్రైవర్లు, గిగ్ ప్లాట్ ఫార్మ్ కిందకు వచ్చే ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్ తదితర కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. అయితే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు కల్పించటం వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో గిగ్ వర్కర్లు సీఎం రేవంత్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 20 వేల గిగ్ వర్కర్లు ఉండగా తమకి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎంను కోరినట్టు సమాచారం. రాజస్థాన్ తరహా గిగ్ ప్లాట్ ఫార్మ్ కార్మికుల సంక్షేమ బిల్లు తేవాలని వర్కర్లు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. దీంతో తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తెచ్చారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు, ఉబర్, ఓలా సిబ్బంది ఉపాధి కోల్పోయారు. దీంతో వారంత మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనలు చేపట్టి బస్ భవన్ ముట్టడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వారి పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలు విన్న సీఎం ఆటో, ఊబర్, ర్యాపిడో, ఓలా వర్కర్ల కోసం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి భరోసా కల్పించనున్నారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.
గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం…
125
previous post