ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంగాను, రాజకీయ దురందుల కోటగాను పేరుగాంచిన జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తున్నందున మెట్ట ప్రాంతంలో మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆది నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల నడుమ రాజకీయ పోరు కొనసాగుతుంది. తాజాగా మారుతున్న కాలాన్ని బట్టి పెరుగుతున్న రాజకీయ పార్టీల తాకిడితో మెట్ట ప్రాంతమైన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట లో రాజకీయం రసవత్తరంగా మారింది. CVR న్యూస్ ప్రత్యేక కథనం మెట్ట ప్రాంతంగా పిలవబడే జగ్గంపేటలో ఆది నుంచి పంతం, తోట, జ్యోతుల కుటుంబాల నడుమ రాజకీయ పోరు కొనసాగుతుంది. ఈ మూడు కుటుంబాలకు ఉభయగోదావరి జిల్లాలోని అన్ని పార్టీల నాయకులతో కుటుంబ బాంధవ్యాలు పెనవేసుకుని ఉన్నాయి. దీనితో రాజకీయంగా ప్రధాన పార్టీలు ఆయా కుటుంబాలను కాదని గత ఐదు దశాబ్దాలుగా మరొకరికి ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు. తాజాగా కొత్త పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో ఆయా కుటుంబాలకు దగ్గర బంధువులే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు.
జగ్గంపేట రాజకీయం ఒక చిత్రం పరిశీలిస్తే ప్రస్తుత శాసనసభ్యుడిగా వైకాపా నుంచి జ్యోతుల చంటిబాబు ఎన్నికయ్యారు. ఈయన రాజకీయ దురంధరుడు గా పేరుగాంచిన తన పెదనాన్న జ్యోతుల నెహ్రూ పై పోటీ చేసి గెలుపొందారు. మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఆరితేరిన జ్యోతుల నెహ్రూ జగ్గంపేట సెగ్మెంట్లో ప్రతిపక్ష పార్టీ నేతగా రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఇబ్బడి ముబ్బడి సంక్షేమ పథకాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జగనన్న పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించే విధంగా జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో ఏదో ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబునీ కాదని అధికార వైసిపి మాజీ మంత్రి తోట నరసింహంను జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. ఆయన పాత క్యాడర్ ను వెంటబెట్టుకుని నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీని పటిష్టవంతం చేసే చర్యల్లో ఆయన తనదైన శైలిలో పావులు కదుపుతూ ముందుకు పోతున్నారు. నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీకి చెందిన కొంత క్యాడర్ మాత్రం ఎటువైపు వెళ్లకుండా గుంభనంగా ఉన్నారు. అధికార వైసిపి టికెట్ జ్యోతుల చంటి బాబు కాదని మాజీ మంత్రి తోట నరసింహం పేరు ప్రకటించగానే పార్టీలో అసంతృప్తులు పెరిగాయనే వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది. ఈ వాదనలకు బలం చేకూర్చే విధంగా నియోజకవర్గ పరిధిలో వైసిపి నుండి టిడిపిలోకి చేరికలు జోరుగానే సాగుతున్నాయి. కిర్లంపూడి ఎంపిపి,జెడ్పీటీసీ, గండేపల్లి జెడ్పీటీసీ, గోకవరం ఎంపిపి లు తమ అనుచర వర్గంతో వైసిపి నీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీటికి తోడు గ్రామస్థాయిలో కూడా టిడిపి నేత జ్యోతుల నెహ్రూ పార్టీలో చేరికలు జోరుగా సాగిస్తూ తన మార్క్ రాజకీయాలు సాగిస్తూ బలం పుంజుకుంటున్నారు.
నియోజకవర్గ స్థాయిలో వైసిపి నుండి టిడిపి లోకి జోరుగా చేరికలు పెరగడంతో అధికార వైసిపి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అసంతృప్త వాదులను పార్టీలోకి తీసుకుని బలం పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి తోడు పార్టీకి దూరంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబును సైతం దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు అధిష్ఠానం చేపట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు కూడా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆయన కాకినాడ ఎంపిగా జనసేన పార్టీ తరుపున బరిలోకి దిగనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. పొత్తులో బాగంగా బరిలోకి జ్యోతుల కుటుంబాలు కలిసి దిగితే అధికార వైసిపి ఓటు బ్యాంక్ గండి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రెండు పార్టీలకు సమాంతరంగా జనసేన పార్టీ జగ్గంపేట ఇన్చార్జి పాఠం శెట్టి సూర్యచంద్ర గత ఏడాదికాలంగా తన భార్యతో కలిసి ప్రతిరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఒక దఫా మొక్కల పంపిణీ అంటూ మరో దఫా పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు పంపిణీ చేస్తూ నిత్యం ప్రజల్లోనే పర్యటిస్తూ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు. పొత్తు లో భాగంగా జగ్గంపేట టికెట్ టిడిపికి కేటాయిస్తే సూర్యచంద్ర పయనం ఎటు అనే విషయం ఆలోచింప చేస్తుంది. అధికార వైసిపి లో ఉన్న లుకలుకలు మాదిరిగానే పొత్తు కుదిరితే జనసేన లోను లుకలుకలు బహిర్గతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టిడిపిలో ఊపందుకున్న చేరికలు… డోలాయమానంలో అధికార వైసిపి
63
previous post