ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
- కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రాయనున్న 33,549 మంది విద్యార్థులు
- జిల్లా వ్యాప్తంగా 56 పరీక్షా కేంద్రాలు
- ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలతో ప్రారంభమై మార్చి 16 వరకు జరిగే పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, మోడల్, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 33,549 మంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16,590 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తుండగా 16,959 మంది విద్యార్థులకు సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 56 మందిని చీఫ్ సూపరింటెండెంట్లను, 56 మంది డిపార్టుమెంట్ అధికారులను నియమించారు. ఎలాంటి పొరపాట్లు, కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక డీఈసీ స్క్వాడ్, ఒక హెపీసీ స్క్వాడ్, మూడు ఫ్లయింగ్ స్వ్కాడ్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్, పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ల నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఉదయం 8.15 కే కేంద్రంలోకి అనుమతి
ఉదయం 8.15 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు.. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించరు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు ప్రిన్సిపాల్స్, ఒక జూనియర్ లెక్చరర్, ఒక హెచ్పీసీ మెంబర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ పరీక్షలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇన్విజిలేటర్లుగా జూనియర్ కళాశాలల లెక్చరర్లతోపాటుగా 170 మంది జిల్లా విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయులను నియమించారు. జిల్లా కేంద్రంలో 35 పరీక్షా కేంద్రాలు,, ఇతర ప్రాంతాల్లో 21 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈసారి జరిగే ఇంటర్మీయట్ పరీక్షలకు దాదాపు రెండు వేల మంది విద్యార్థులు పెరిగారు.ఏడు పరీక్షా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను అమలు చేయడంతోపాటు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను పరీక్ష ముగిసే వరకు మూసివేస్తారు.
జి జగన్మోహన్రెడ్డి, డీఐఈవో
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసు, రెవెన్యూ, విద్యా శాఖ, ఎన్పీడీసీఎల్, ఆరోగ్యశాఖ, ఆర్టీసీ అధికారుల సమన్వయంతో పరీక్షలు సజావుగా జరిగేందుకు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం జరుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. టెలి మానస్ అనే కార్యక్రమం ద్వారా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసింది. విద్యార్థులు టోల్‌ఫ్రీ నంబర్లు 14416, 1800-914416కు ఫోన్ చేస్తే సలహాలు, సూచనలు ఇస్తారు. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులుంటే డీఐఈవో కార్యాలయంలో సంప్రదించాలి. విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం, గెజిటెడ్ సంతకం చేయించాల్సిన అవసరం లేదు. హాల్టికెట్లలో పరీక్షా కేంద్రా చిరునామా సరిగా ఉందో లేదో చూసుకోవాలి. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించరు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి : బయో ఆసియా 2024 సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.