తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం 3 గంటల పాటు సాగింది. జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిశోర్ ఓ నివేదికను చంద్రబాబుకు అందించారు. రాష్ట్ర యువతలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ధరల పెంపు, కరెంటు చార్జీల పెంపు, పన్నులు, నిరుద్యోగం తదితర అంశాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆ నివేదికలో పొందుపరిచారు. దళితులు, బీసీలపై దాడులు వైసీపీకి ప్రతికూలంగా మారాయని… బీసీలు, దళితులను వైసీపీకి దూరం చేశాయని కూడా ప్రస్తావించారు. ఎవరో ఒకరిద్దరు మంత్రులను మినహాయిస్తే, మిగతా మంత్రులకు సున్నా మార్కులు పడతాయని నివేదికలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానిది అహంకార ధోరణి అనే భావన ప్రజల్లో నెలకొందని కూడా వివరించారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు విపక్షం తగిన వ్యూహ రచన చేసుకోవాలని, యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలని నివేదికలో సూచించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సిఫారసు చేశారు. చంద్రబాబు అరెస్ట్ కారణంగా… తటస్థంగా ఉండేవారిలోనూ, వైసీపీ వర్గాలోనూ జగన్ పై వ్యతిరేకత వచ్చిందని ప్రశాంత్ కిశోర్ నివేదికలో స్పష్టం చేశారు. కాగా, ప్రశాంత్ కిశోర్ తన నివేదికలో ఆయా వర్గాలు, అంశాల వారీగా ప్రభుత్వ బలాబలాలను కూడా విశ్లేషించారు.
చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశం…
84
previous post