హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా మిగిలిన మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని భావించారు. అయితే, సీఎం పదవి దక్కని సీనియర్లు తమ శాఖలు..ప్రాధాన్యతల పైన ఇప్పటికీ హైకమండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా మంత్రివర్గ కూర్పు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. దీంతో..పూర్తి స్థాయి మంత్రివర్గం కాకుండా.. రేవంత్ సీఎంగా.. మరో ఆరుగురు మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కొత్త మంత్రివర్గం పైన ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. రేవంత్ సీఎం కావటంతో ఇప్పుడు కొత్తగా పీసీసీ చీఫ్ పదవి మరొకరికి ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో స్పీకర్ ఎంపిక సైతం కీలకంగా ఉంది. ప్రతిపక్షం బలంగా ఉండటంతో స్పీకర్ పదవికి ఎంపిక పైన ఆచి తేచి వ్యవహరిస్తున్నారు.
ఇక..రేవంత్ తో పాటుగా సామాజిక వర్గాల వారీగా సీనియర్లుకు ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎస్సీ వర్గం నుంచి భట్టి విక్రమార్క, మాదిగ వర్గం నుంచి దామోదర రాజనర్సింహ, ఎస్టీ వర్గం నుంచి మహిళకు ఇచ్చేలా సీతక్క, మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ వర్గం నుంచి ఒక సీనియర్ నేతకు అవకాశం ఉందని తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ ఆరుగురు ప్రమాణం చేయటం ఖాయంగా కనిపిస్తోంది.
భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల కోసం ఢిల్లీ అగ్రనాయకత్వాన్ని పలువురు ప్రముఖులు కలుస్తున్నారు. జీ వినోద్ నేరుగా సోనియాను కలిసి మంత్రి పదవి కోరారు. ఈ రాత్రిలోగా కసరత్తు పూర్తయితే పూర్తి స్థాయి మంత్రివర్గం పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే, కసరత్తు పూర్తి కాకుంటే ఈ ఆరుగురితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.