ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను తప్పకుండా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు ఆయన నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామన్నారు. 15వేల పోలీసు ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని… వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పరిస్థితిని సమీక్షించి నియామకాలు త్వరగా జరిగేలా చూశారన్నారు. ఉద్యోగ నియామకం వేళ మీ సంతోషంలో భాగస్వాములం కావాలనుకున్నామన్నారు. విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడిందని… గడిచిన పదేళ్లలో రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ ప్రయోజనాలు ఆలోచించిందని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై కేసులు పెట్టి వేధించిందని ఆరోపించారు. కూతురును నిజామాబాద్ నుంచి ఓడిస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ కోసం పోరాడిన వారి ఉద్యోగాల గురించి మాత్రం ఆలోచించలేదన్నారు.
54
previous post