పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం, మానుకొండవారిపాలెంలో తుఫాన్ కు దెబ్బతిన్న శనగ, పొగాకు, మిరప, వరి కల్లాలను తెదేపా రాష్ట్ర బృందంతో కలిసి మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అనంతరం రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ రైతుకు భరోసా కల్పించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇప్పించేందుకు వచ్చామన్నారు. అన్నదాత కష్టాల్లో ఉంటే దెబ్బతిన్న పంటల పరిశీలనకు చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత జగన్‌రెడ్డి కదిలారని మండిపడ్డారు. ఎక్కడా కూడా పొలాల్లోకి దిగిన దాఖలాలు లేవన్నారు. కాలికి మట్టి అంటకుండా తిరిగితే రైతుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. పంట నష్టపోయి అన్నదాతలు నిద్రల్లేని రాత్రులు గడుపుతుంటే జగన్‌కు ఎవరిని ఎక్కడికి మార్చాలి.. మళ్లీ అధికారంలోకి రావాలనే ధ్యాస తప్ప మరొకటి లేదన్నారు. ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారో ప్రకటనే చేయలేదన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, ఈ-క్రాపింగ్ ఎంత బుక్ చేశారో కూడా చెప్పడం లేదని… ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వమో అర్థం కావడం లేదన్నారు. పంట దెబ్బతిన్న 22 లక్షల ఎకరాల్లో ఈ-క్రాపింగ్ బుకింగ్ ఎంత వస్తుంది.. రాని వారికి, కౌలుదార్లకు ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందనే వాటిపైనా ఏమీ చెప్పలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్రాంతి లోపు చెల్లిస్తామని చెబుతున్నారని.. ఈలోపు ఇవ్వకపోతే జనవరి 20 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చి జగన్‌రెడ్డి తప్పించుకునే అవకాశం ఉందన్నారు. కాబట్టి తక్షణమే రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని, తడిసినధాన్యం, మిరప కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే వైకాపాలో అభ్యర్థుల మార్పులపైనా చురకలు వేశారు. చెల్లని రూపాయి ఎక్కడ ఉన్నా చెల్లనిదే అని అన్నారు. స్థానాలు మార్చినంత మాత్రాన వాళ్ల అవినీతి, అక్రమాల చరిత్రలు చెరిగిపోవు అన్నారు. చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని చేసిన అవినీతి, దుర్మార్గాల్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడుగురిని మార్చారని.. అభ్యర్థులను మార్చినంత మాత్రానా వారు చేసిన అవినీతి, దుర్మార్గాలు ఎక్కడిపోతాయని ప్రశ్నించారు.
ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వం…..
63
previous post