జీతాలు పెంచాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉలవపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని, ఉలవపాడులో అంగన్వాడీల సమ్మె కొనసాగుతూనే ఉంది. కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం శిబిరానికి వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లోనూ.. చంద్రబాబు నాయుడు అంగన్వాడీలకు రెండుసార్లు జీతాలు పెంచారని గుర్తు చేశారు. కానీ అనేక ఆశలు చూపి, వారి చేత ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక లక్షలాది అక్క చెల్లెమ్మలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణలో కంటే అదనంగా జీతాలు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పారని నాగేశ్వరావు అన్నారు. ఒకసారి మాత్రమే వెయ్యి రూపాయలు పెంచి, వారికి సంక్షేమ పథకాల అమలులో కోత విధించారని మండిపడ్డారు. ఉద్యోగులకు తమ సమస్యలు చెప్పుకునే హక్కు ఉంటుందని, కానీ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమ్మెపై ఉక్కుపాదం మోపి రకరకాలుగా బెదిరించడం దుర్మార్గమని నాగేశ్వరరావు అన్నారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అంగన్వాడీలకు సంబంధించిన అన్ని సమస్యలను చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తారని నాగేశ్వరరావు తెలిపారు. ఎలాంటి షరతులు విధించకుండానే, మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి మహిళ కుటుంబానికి అందజేస్తారని వివరించారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్యక్రమం జరగగా, మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు అంచుపోగు వాసు, ఎంపీటీసీ దార్ల యలమందమ్మ, క్లస్టర్ ఇంచార్జ్ లు బెల్లం కృష్ణమోహన్, పోలుబోయిన శ్రీనివాసులు, సుదర్శి శ్రీనివాసులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన ఇంటూరి…
152
previous post