మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ అక్టోబరులో కుంగింది. ఈ బ్లాకులో పియర్స్ దెబ్బతినడంతోపాటు దిగువన కాంక్రీటు బ్లాకులు కొట్టుకుపోవడం, గ్లేసియర్ దెబ్బతినడం తదితర సమస్యలు ఎదురయ్యాయి. నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించి పలు చర్యలు సిఫార్సు చేశారు. ఏబీ పాండ్యా ఛైర్మన్గా ఉన్నరాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీని పరిశీలించింది. మరోవైపు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది. అయితే, బ్యారేజీ కుంగడానికి గల కారణాలను తెలుసుకొని పునరుద్ధరించడం ప్రాధాన్య అంశంగా ఉన్న నేపథ్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఏబీ పాండ్యా నేతృత్వంలో స్ట్రక్చరల్, హైడ్రాలజీ నిపుణుడు, మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ రామరాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్) మురళీధర్, ఇంజినీర్ ఇన్ చీఫ్(ఓఅండ్ఎం) నాగేందర్రావు తదితరులతో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆమోదం తర్వాత కమిటీ.. బ్యారేజీ కుంగడానికి గల కారణాలపై అధ్యయనం చేసి రెండు, మూడు ప్రత్యామ్నాయాలతో నివేదిక తయారు చేయనుంది. తర్వాత కేంద్ర జలసంఘంతో చర్చించి తుది ఆమోదంతో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉందని ఆయా వర్గాలు తెలిపాయి.
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై కమిటీ ఏర్పాటు…
99
previous post